Allu Aravind visits Sree Tej in KIMS Hospital at Secunderabad : సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ పరామర్శించారు. బాలుడి కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడారు. అలాగే శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి బాలుడు గత రెండు వారాలుగా సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు.
అయితే శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ ఎందుకు రాలేదనే కారణాన్ని తండ్రి అల్లు అరవింద్ వివరించారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్నందున అల్లు అర్జున్ రాలేకపోయారని తెలిపారు. అందుకే అల్లు అర్జున్ తరపున నేను ఆస్పత్రికి వచ్చానని అల్లు అరవింద్ స్పష్టం చేశారు. బాలుడు శ్రీతేజ్ ఆరోగ్యం విషమంగానే ఉందని కిమ్స్ వైద్యులు మంగళవారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో తెలిపారు. ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్‌పైనే ఉన్నాడన్నారు. మెదడుకు ఆక్సిజన్ సరిగా అందటం లేదన్నారు. బాలుడు శ్రీతేజ్‌ను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వివరించారు. ప్రస్తుతం ట్యూబ్ ద్వారా ఆహారం అందిస్తున్నామని వైద్యులు వివరించారు.
Show cause Notices Issued to Sandhya Theater: హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్‌కు సీపీ సీవీ ఆనంద్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 4వ తేదీ రాత్రి పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి వల్ల జరిగిన ఘటన నేపథ్యంలో లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలంటూ నోటీసులు జారీ చేశారు. దీనిపై 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.
బాలుడిని పరామర్శించిన సీపీ సీవీ ఆనంద్ : కిమ్స్ ఆసుపత్రిలో సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడిని సీపీ సీవీ ఆనంద్ మంగళవారం పరామర్శించారు. కిమ్స్ ఆసుపత్రిలో 13 రోజులుగా బాలుడు చికిత్స పొందుతున్నాడు. బాలుడిని పరామర్శించిన అనంతరం ఆసుపత్రి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. సంధ్య థియేటర్ ఘటన జరిగి రెండు వారాలు అవుతుందని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ప్రభుత్వం తరఫున నేను, హెల్త్ సెక్రటరీ వచ్చామని అన్నారు. రెండు వారాల నుంచి తీవ్రంగా గాయపడిన బాలుడికి చికిత్స కొనసాగుతోందన్నారు. ఎలాంటి చికిత్స అందిస్తున్నారో డాక్టర్లను అడిగి తెలుసుకున్నామని పేర్కొన్నారు.
జైలు నుంచి బన్నీ ఇంటికి - హత్తుకుని ఏడ్చిన స్నేహా రెడ్డి
సుకుమార్ భావోద్వేగం - బన్నీని కలిసిన విజయ్ దేవరకొండ సహా ఇతర సినీప్రముఖులు