Nara Lokesh serious on Minister Parthasarathy and MLA Gouthu Sireesha : ఏలూరు జిల్లా నూజివీడులో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేత జోగి రమేశ్‌తో కలిసి తెలుగుదేశం సీనియర్ నేతలు అత్యంత సన్నిహితంగా మెలగడంపై ఆ పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. చంద్రబాబు ఇంటిపై దాడికి దిగడంతోపాటు వ్యక్తిగత విమర్శలు చేసిన జోగితో కలిసి పట్టణంలో ర్యాలీలో పాల్గొనడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానం సైతం తీవ్రంగా మండిపడగా మంత్రి పార్థసారథి చంద్రబాబుకు క్షమాపణలు చెప్పగా, ఎమ్మెల్యే గౌతు శిరీష వివరణ ఇచ్చారు.
సామాజిక మాధ్యమాల్లో కార్యకర్తలు నిరసన : ఏలూరు జిల్లా నూజివీడులో ఆదివారం సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మాజీమంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేశ్‌తో కలిసి మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే గౌతు శిరీష, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ పాల్గొనడంపై తెలుగుదేశం శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. జోగి రమేశ్‌తో ఒకే వాహనంపై ఊరేగడం అత్యంత సన్నిహితంగా మెలగడాన్ని ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. చంద్రబాబు ఇంటిపైకి దండయాత్రలా వచ్చి దాడికి దిగిన జోగి రమేశ్‌తో పార్టీ సీనియర్ నేతలు వేదిక పంచుకోవడంపై సామాజిక మాధ్యమాల్లో కార్యకర్తలు, అభిమానులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఒక కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు ఎవరెవరొస్తున్నారో కనీసం చూసుకోవాల్సిన పనిలేదా అంటూ నిలదీశారు. పార్టీ అధిష్టానం ఇచ్చిన అలుసు వల్లే నేతలు ఇలా వ్యవహరించారంటూ అధిష్టానంపైనా విమర్శలకు దిగారు.
ఎమ్మెల్యే గౌతు శిరీష వివరణ : నూజివీడు ఘటనపై మంత్రి లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కార్యక్రమానికి హాజరైన నేతల నుంచి వివరణ కోరారు. సర్దార్ గౌత్ లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి నిర్వాహకులు అందరినీ పిలిచారని వైఎస్సార్సీపీ నేత జోగి రమేశ్ కూడా వచ్చారని, అది అనుకోకుండా జరిగిన ఘటనేనని వివరణ ఇచ్చారు. దీనిపై ఆయన అధినేత చంద్రబాబుకు క్షమాపణలు చెప్పారు. ఎవరెవరొస్తున్నారో తెలియకే జోగి రమేశ్ హాజరైన కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని ఎమ్మెల్యే గౌతు శిరీష వివరణ ఇచ్చారు.
నేతలు వివరణ ఇచ్చినా టీడీపీ శ్రేణుల ఆగ్రహావేశాలు చల్లారలేదు. ఒకవేళ ఎవరెవరొస్తున్నారో అక్కడికి వెళ్లేవరకు తెలియకపోయినా అక్కడికి వెళ్లిన తర్వాతైనా జోగి రమేశ్‌తో కలిసి ఒకే వాహనంపై ఊరేగడం ఏంటని నిలదీస్తున్నారు.
'ఇలా జరుగుతుందని మాకు తెలియదు' - క్షమాపణలు చెప్పిన మంత్రి, ఎమ్మెల్యే