Telangana RTC Announces to Rakhi Offer: ప్రైవేట్ మార్కెట్‌కు ధీటుగా లాజిస్టిక్స్ విభాగాన్ని బలోపేతం చేసిన ఆర్టీసీ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. ఈనెల 19వ తేదీన రక్షాబంధన్ సందర్భంగా స్వయంగా వెళ్లి రాఖీ కట్టలేని యువతులకు, మహిళలకు ఆర్టీసీ లాజిస్టిక్ అందుబాటులో ఉంటుందని సంస్థ హామీ ఇస్తుంది. రక్షాబంధన్ సందర్బంగా రాఖీలు, స్వీట్లు బట్వాడ కోసం ప్రధాన బస్టాండ్లలో అదనంగా 100 కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామని యాజమాన్యం ప్రకటించింది.
బుక్ చేసిన కౌంటర్ నుంచి 24 గంటల్లో వాటిని డెలివరీ చేస్తామని అధికారులు హామీ ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 490కి పైగా బుకింగ్ కౌంటర్లను, 9,000లకు పైగా పార్శిల్ రవాణా వాహనాలను, 190కి పైగా నాలుగు టన్నుల నుంచి 10 టన్నుల కార్గో వాహనాలను ఆర్టీసీ కలిగి ఉంది. అన్నాచెల్లెలు అనుబంధానికి ప్రతీక చెప్పుకునే రక్షాబంధన్ సందర్భంగా స్వయంగా వెళ్లి రాఖీలు కట్టలేని యువతులు తమ లాజిస్టిక్స్‌ను వినియోగించుకుని రాఖీలను, స్వీట్లను తమ అన్నలకు, తమ్ముళ్లకు పంపించుకోవచ్చని ప్రకటించింది.
24 గంటల్లోనే రాఖీలు, స్వీట్లు గమ్యస్థానాలకు బట్వాడా :ఆర్టీసీ సంస్థ నెట్‌వర్క్‌తో కేవలం 24 గంటల్లోనే రాఖీలను, స్వీట్లను గమ్యస్థానాలకు చేరవేస్తామనిఆర్టీసీ యాజమాన్యం హామీ ఇస్తుంది. కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కాకుండా, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు రాఖీలను, స్వీట్లను పంపించుకోవచ్చు అని అధికారులు పేర్కొంటున్నారు. బుకింగ్ కౌంటర్లు 24 గంటల పాటు ఎంపిక చేయబడిన బస్ స్టేషన్లలో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.