Speaker Ayyannapatrudu Angry on YSRCP Members: సభలో నిన్న వైఎస్సార్సీపీ సభ్యుల ప్రవర్తనపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సభలో నిన్నటి పరిణామాలు బాధ కలిగించాయని అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సభ ప్రారంభం కాగానే ఆయన మాట్లాడారు. గవర్నర్ని అతిథిగా ఆహ్వానించి ఆయనతో ప్రసంగం ఇప్పిస్తే సభ్య సమాజం అసహ్యించుకునేలా వైఎస్సార్సీపీ వ్యవహరించిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి సభ్యత మరిచి ప్రవర్తించాడని స్పీకర్ మండిపడ్డారు.
తన పార్టీ నేతలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ, ప్రసంగం పుస్తకాలు చించుతుంటే వారిని జగన్ నియంత్రించాల్సింది పోయి కూర్చుని నవ్వుకుంటాడా అని స్పీకర్ ప్రశ్నించారు. బొత్స లాంటి సీనియర్ నేత పక్కనే ఉండి కూడా జగన్ చేసేది తప్పని చెప్పకపోవటం సరికాదని హితవు పలికారు. రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలు జరగడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. ఇకపై అయినా విజ్ఞతతో వ్యవహరించాలని అన్నారు. రాజ్యాంగం ద్వారా కాకుండా సర్వ హక్కులు తనకే ఉన్నాయి అన్నట్లు ప్రవర్తించటం ఎవరికీ తగదని అన్నారు. నిన్నటి వైఎస్సార్సీపీ తీరును ప్రతీ ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని స్పీకర్ అయ్యన్న తెలిపారు.
11 నిమిషాలు ఉండటానికి 11 మంది ఎమ్మెల్యేలతో వచ్చారా?: వైఎస్ షర్మిల
సాక్షి పత్రిక, మీడియాపై క్రమశిక్షణ చర్యలు: సాక్షి మీడియాకు ప్రివిలేజ్ నోటీసులు ఇవ్వాలని శాసనసభ నిర్ణయించింది. స్పీకర్ అయ్యన్నపాత్రుడు సభా హక్కుల కమిటీకి సాక్షి కథనాలను రిఫర్ చేశారు. ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు జరగకుండా కోట్లాది రూపాయలు వెచ్చించారంటూ సాక్షి కథనాలను సభ దృష్టికి నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య తెచ్చారు. సాక్షి పత్రిక, మీడియాపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సభాపతి నిధుల దుర్వినియోగం చేసారంటూ వచ్చిన కథనాలపై కఠిన చర్యలు ఉండాలని కోరారు.
శిక్షణ తరగతులు లేకుండా కోట్లాది రూపాయలు దుర్వినియోగం అంటూ వచ్చిన కథనాలు నన్ను బాధించాయని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఇలాంటి అసత్య కథనాలు ఉపేక్షించరాదని తేల్చిచెప్పారు. సభ్యుల కోరిక మేరకు సాక్షి అసత్య కథనాలపై చర్యలకు సభా హక్కుల కమిటీకి సిఫార్సు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. సభా హక్కుల కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని వెల్లడించారు.
వచ్చినా రానట్టే - 60 రోజులు రాకపోతే జగన్ సభ్యత్వం రద్దు అవుతుందా?