Natural Beauty of Kailash Giri in Srikalahasti: దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి దివ్య క్షేత్రంలో ఎన్నెన్నో అద్భుతాలున్నాయి. వాటిల్లో ప్రాశస్త్యంతో పాటు పర్యాటక ధామంగా ఖ్యాతి గడించింది వేయిలింగాలకోన. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో కైలాసగిరుల్లో కొలువుదీరిన ఇక్కడి ప్రకృతి అందాలు బండరాళ్ల మధ్య నుంచి జాలువారే సన్నని నీటి జలధారలు కనుచూపు మేర కన్పించే పచ్చదనం చూసి ప్రతి ఒక్కరూ ఆనందాల్లో తేలియాడటం తథ్యం.
దేవతా సహస్రంగా ప్రాశస్త్యం: కైలాసగిరుల్లో అత్యంత పవిత్రమైన ప్రాంతంగా అభివర్ణిస్తారు. ఇదే విషయాన్ని ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర శతకంలోనూ విశిదపరచడంతో మరింత విశేషతను సంతరించుకుంటోంది. దేవతలందరూ వారి శక్తుల కారణంగా విజయలక్ష్మిని పొందగల్గినట్లుగా భావించి అహంకారంతో వారిలో వారు కలహించుకోవడంతో కోపోద్రిక్తుడైన సదాశివుడు వారికి జ్ఞానబోధ కల్పించాలని భావిస్తాడు. అప్పుడు కైలాసగిరుల్లోని ఓ యక్షగుహలో యక్షుని రూపం దాల్చి దేవతల శక్తిని పరీక్షించేందుకు ఓ గడ్డి పరకను దహించమని దేవతలను కోరతాడు.
వైభవంగా కల్యాణ వెంకన్న రథోత్సవం - తిరుమల శ్రీవారి సేవలో సినీనటులు
అప్పుడు వాళ్ల శక్తులు చాలకపోవడంతో పరమేశ్వరుని తత్వాన్ని పార్వతీదేవి ద్వారా తెలుసుకున్న భక్తులు ఆయన్ను క్షమించమని ప్రార్థించిన దివ్య ప్రదేశమే ఈ సహస్రలింగ తీర్థంగా చెప్తారు. దేవతలందరి చేత పూజలందుకోవడం కారణంగా అక్కడ వెలసిన శివలింగంపై చుట్టుకు వంద వంతున వెయ్యి గీతలుండటం ఇక్కడి శివలింగాకృతి ప్రత్యేకం. ఆకృతి శివలింగంతో సహస్రలింగేశ్వరునిగా శ్రీకాళహస్తీశ్వరాలయంలో దర్శనీయడం విశేషం. దేవతలందరూ జ్ఞానసిద్ధిని పొందిన దివ్య ప్రాంతం కావడంతో వేయిలింగాల తీర్థం ప్రాచుర్యం పొందింది.

పర్యాటక ధామంగా: ప్రకృతి రమణీయతను పంచే పచ్చని పొదరిళ్లతో ఇక్కడి వేయిలింగాల కోన ఆకట్టుకుంటోంది. ఇక్కడ కొలువుదీరిన సహస్రలింగేశ్వరుని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులు ముందుగా ఇక్కడి జలపాతాన్ని సందర్శిస్తారు. సహస్రలింగేశ్వరుని ఆలయానికి సమీపంలో అష్టదిక్పాలకులు శివానుగ్రహం కోసం ప్రార్థించిన దివ్య శివాలయం, అక్కడకు సమీపంలో కొండల్లోంచి జాలువారే జలపాతాలు నయనానందాన్ని కల్గిస్తాయి.
ఆకట్టుకునే శిల్పసంపద: పురాతనమైన శిలాజాలు, శిలలపై చెక్కిన శిల్పాలు చూపరుల మనస్సును ఆకట్టుకుంటాయి. కొండల్లోంచి వచ్చే జలధారలకు సమీపంలో రాతి బండలపై నందీశ్వరునిపై శివపార్వతుల వైభవం, భక్తకన్నప్ప, వనదేవతలు, మహర్షుల ప్రతిమలు సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఆధ్యాత్మికంగాను, పర్యాటకంగాను ఈ ప్రాంతం ప్రత్యేక గుర్తింపును పొందింది.

1008 కిలోల లడ్డూ బూందీతో శివలింగం - పెన్సిల్ మొనపై శివతాండవం