Pawan Kalyan Fires on YSRCP : శాసనసభ్యులు పౌరులకు ఆదర్శంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. గవర్నర్ ప్రసంగిస్తుంటే వైఎస్సార్సీపీ నేతలు అలా ప్రవర్తించవచ్చా? అని ప్రశ్నించారు. ఆ పార్టీ నాయకులు గొడవ, బూతులకు పర్యాయపదాలుగా మారారని విమర్శించారు. చట్టాలు చేయాల్సిన వాళ్లే నియమాలు ఉల్లంఘిస్తే ఎలా అని నిలదీశారు. అసెంబ్లీలో వైఎస్సార్సీపీ విధ్వంసం చూస్తే వివేకా హత్యే గుర్తొచ్చిందని వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో ఆయన మాట్లాడారు.
వైఎస్సార్సీపీని ఐదేళ్లు తట్టుకొని నిలబడిన చంద్రబాబుకు హ్యాట్సాఫ్ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆ పార్టీ నేతలు అసెంబ్లీలోనే ఇలా ప్రవర్తిస్తే బయట ఇంకెలా ప్రవర్తిస్తారోనని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ అని తెలిపారు. గవర్నర్ సందేశాన్ని వైఎస్సార్సీపీ నాయకులు బాయ్‌కాట్ చేయడం దురదృష్టకరమన్నారు. వారు ఇబ్బంది పెడుతున్నా గవర్నర్ విజయవంతంగా ప్రసంగం పూర్తిచేశారని అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.
"ఎన్డీయే సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలతీరు పట్ల గవర్నర్‌కు మేం క్షమాపణలు చెబుతున్నాం. మా తప్పు లేకున్నా గవర్నర్‌కు క్షమాపణలు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం రాజధాని పట్ల 3 ముక్కలాట ఆడింది. వైఎస్సార్సీపీ పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయి. ఒకేరోజు 13,326 గ్రామసభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించాం. అప్పటి సర్కార్ ఐదేళ్లలో కేవలం 1800 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేసింది. మా ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే 4000ల కిలోమీటర్లకు పైగా సీసీ రోడ్లు వేశాం. మా హయాంలో 22,000లకు పైగా గోకులాలు నిర్మించాం. గత ప్రభుత్వం జల్‌జీవన్ మిషన్ నిధులు దుర్వినియోగం చేసింది." - పవన్ కల్యాణ్, ఉప ముఖ్యమంత్రి
'గత ప్రభుత్వంలో అటవీశాఖ మంత్రి 77 ఎకరాల అటవీభూమి ఆక్రమించారు. రాష్ట్రంలో ఎర్రచందనం కొట్టి తరలిస్తుంటే కర్ణాటక అటవీ అధికారులు పట్టుకొన్నారు. కర్ణాటక అధికారులు పట్టుకొన్న ఎర్రచందనం వేల వేస్తే వారికి రూ.185 కోట్లు వచ్చింది. పొలంగూడ గిరిజన గ్రామానికి రోడ్డు వేయడం వల్ల డోలి మోతలు తప్పాయి. అక్కడికి అంబులెన్స్‌లు వెళ్లి ప్రాణాలు కాపాడుతున్నాయి. సీఎం కృషి వల్లే విశాఖ ఉక్కు పరిశ్రమను రక్షించుకున్నాం. గత ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్లాట్లు వేసేందుకు సిద్ధపడింది' అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
AP Assembly Budget Session 2025 : సంకీర్ణ ప్రభుత్వం సవాళ్లతో కూడుకున్నదని పవన్ కల్యాణ్ అన్నారు. ఎన్ని సమస్యలున్నా ప్రజల కోసం కలిసే ఉంటామని స్పష్టంచేశారు. తాము కలిసి లేకుంటే ప్రజలకు ద్రోహం చేసినట్లేనని చెప్పారు. తమను అగౌరవపరిచేలా మాట్లాడినా కలిసే ఉండనున్నట్లు తెలిపారు. 15 ఏళ్లపాటు కలిసే అధికారంలో ఉంటామని వివరించారు. ఏపీలో ప్రతిపక్షం అనేది లేదని ప్రజలు ఆ అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు. ప్రాణం ఉన్నంతవరకు రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పవన్ కల్యాణ్ వెల్లడించారు.
జగన్ ప్రవర్తించిన తీరు దారుణంగా ఉంది: కూన రవికుమార్
మండలిలో కూటమి Vs వైఎస్సార్సీపీ - సవాళ్లు, ప్రతిసవాళ్లతో వాడీవేడీ చర్చ