Tension at BRS Leader Aruri Ramesh Residence :తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ స్పష్టం చేశారు. తమ పార్టీ నేతలతో కలిసి తాను హైదరాబాద్ వచ్చానని అన్నారు. తాను బీఆర్ఎస్లోనే ఉన్నా అంటూ చెప్పారు. అసలు తాను అమిత్ షాను కలవలేదని ప్రకటించారు. ఆరూరి రమేశ్‌ను వరంగల్ నుంచి హైదరాబాద్ తీసుకువచ్చిన బీఆర్ఎస్ నేతలు, నేరుగా కేసీఆర్ ఇంటికి తీసుకెళ్లారు. ఆయన పార్టీ మారకుండా కేసీఆర్ వర్ధన్న పేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌తో చర్చించారు.
ఆరూరి రమేశ్‌ను బలవంతంగా కారులో ఎక్కించుకున్న బీఆర్ఎస్ నేతలు : వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీకి సిద్ధమైన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ను బీఆర్ఎస్ నేతలు బలవంతంగా కారులో ఎక్కించి తీసుకెళ్లడం కలకలం రేపింది. వరంగల్ పార్లమెంటు స్థానానికి ఆరూరి బీజేపీ తరఫున పోటీ చేయనున్నట్లు ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి బలం చేకూర్చుతూ మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Aruri Ramesh meet Amit Shah)తో సమావేశం అయినట్లు సమాచారం. దీంతో ఆయన బీజేపీలో చేరడం ఖాయమైంది. ఇదే విషయాన్ని మీడియాకు వెల్లడించేందుకు తన నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, కుడా మాజీ ఛైర్మన్ సుందర్ రాజ్ తదితరులు ఆరూరి నివాసానికి చేరుకున్నారు. బీఆర్ఎస్ను వీడవద్దంటూ ఆరూరి రమేశ్‌ను బుజ్జగించే యత్నం చేశారు. ఇదే సమయంలో ఆరూరిని బలవంతంగా కారులో ఎక్కించేందుకు ప్రయత్నించగా ఆరూరి అనుచరులు అడ్డుకున్నారు. పరస్పర నినాదాల నడుమ ఆయనను బీఆర్ఎస్ నేతలు(BRS vs BJP) తమ వాహనంలో ఎక్కించుకుని హైదరాబాద్ తీసుకెళ్లారు.