Telangana Lok Sabha Elections Polling 2024 Ended : రాష్ట్రవ్యాప్తంగా ఒకటి, రెండు ఘటనలు మినహా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగింది. 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రజలు ఉత్సాహంగా ఓటేశారు. ఉదయం కాస్త మందకొడిగా పోలింగ్ కొనసాగగా, ఆ తర్వాత కాస్త పుంజుకుంది. సాయంత్రం 5 గంటల వరకు 61.16 శాతం పోలింగ్ నమోదైంది. జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలం చిన్నకొలువాయిలో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. గ్రామంలో 100 శాతం ఓటు వేసి అక్కడి ప్రజలు అందరికీ ఆదర్శంగా నిలిచారు. గ్రామంలో 110 ఓట్లు ఉండగా, ఎవరూ పనులకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉండి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 100 శాతం పోలింగ్ నమోదుపై జగిత్యాల కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా చిన్న కొలువాయి ఓటర్లను అభినందించారు.
First Time Voters Cast Their Vote :తొలిసారి ఓటు వేసేందుకు వచ్చిన యువ ఓటర్లకు ఎన్నికల అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. నిర్మల్ జిల్లా సోన్ మండలం న్యూవెల్మల్ మడల్ పోలింగ్ కేంద్రంలో స్వీప్ కమిటి ఆధ్వర్యంలో తొలిసారి ఓటు వేసేందుకు వచ్చిన యువతకు పుష్పగుచ్చాలందించి డప్పులతో స్వాగతం పలికారు. మహబూబ్‌గర్ జిల్లా జడ్చర్లలో పోలింగ్ కేంద్రాలను అందంగా ముస్తాబు చేశారు. పూలతోరణాలు, బెలూన్లు కట్టి అలంకరించారు. ఆదర్శపొలింగ్ కేంద్రంకావడంతో సరికొత్తగా తీర్చిదిద్దినట్లు అధికారులు వివరించారు. నల్గొండలో పర్యావరణహితంగా కొబ్బరి, అరటి ఆకులు, చిలుకలు, మామిడి తోరణాలతో పర్యావరణ హితంగా పోలింగ్ కేంద్రాన్ని తీర్చిదిద్దారు.
ఆ ప్రాంతాల్లో 4 గంటలకే ముగిసిన పోలింగ్ :మావోయిస్టుల ప్రాబల్యమున్న 5 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియగా మిగతా 106 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాయంత్రం 6 వరకు కొనసాగింది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 525 అభ్యర్థులు బరిలో నిలవగా వారిలో 50 మంది మహిళలు ఉన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో 68 మంది జాతీయ, ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు కాగా 285 మంది స్వతంత్రులు. అధికంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి 45 మంది పోటీలో ఉండగా తక్కువగా ఆదిలాబాద్‌లో 12 మంది బరిలోనిలిచారు. పోలింగ్ ప్రారంభంలో కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించగా అధికారులు సరిచేశారు. అనంతరం ఓటింగ్ ప్రశాంతంగా సాగింది.