Telangana Lok Sabha Elections Campaign 2024 : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచార జోరు పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలతో రైతులను నట్టేట ముంచితే రాష్ట్రంలోని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను కనీసం పరామర్శించలేదని మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క ధ్వజమెత్తారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన పెద్దపల్లి పార్లమెంట్ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, స్థానిక శాసన సభ్యులు ప్రేమ్ సాగర్ రావు, వినోద్, పెద్దపల్లి కాంగ్రెస్పార్టీ పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. కేసీఆర్ రైతుల మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తూ మద్యం కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్‌లను పక్కదారి పట్టిస్తున్నారని మంత్రులు ఆరోపించారు.
Congress Lok Sabha Election Campaign: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నిర్వహించిన జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో షబ్బీర్ అలీ పాల్గొన్నారు. త్వరలోనే గ్రామస్థాయిలో ఇందిరమ్మ కమిటీలు వేస్తామని ఐదుగురు పురుషులు, ఒక మహిళకు చోటు కల్పిస్తామన్నారు. గ్రామస్థాయిలో ప్రభుత్వ పథకాలను అమలు చేసే బాధ్యత వీరిపై ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి దామోదర రాజనర్సింహ జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణలో కేసీఆర్ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసి మా పైన రూ.7 లక్షల కోట్ల అప్పును మోపారు. ఆ అప్పుతో పాటు వడ్డీని కూడా మోపారు. కట్టడానికి మేము అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, ఇబ్బంది పడుతున్నప్పటికీ ప్రజలకు ఇచ్చే వాగ్దానాలు నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నాం. రైతుకు ఏ విధంగా మేలు చేయాలో మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ధాన్యం కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగింది."- శ్రీధర్ బాబు, ఐటీ శాఖ మంత్రి