HC Reaction on BJP Candidate Ballot Paper Change: బ్యాలెట్ పేపర్‌లో మార్పులపై చేవేళ్ల పార్లమెంటరీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమర్పించిన వినతి పత్రాన్ని పరిశీలించి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. చేవేళ్ల పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒకే పేరుతో ఇద్దరు నామిషన్ వేసినందున ఒక్కో పేరు మధ్య కనీసం 10 నంబర్ల వ్యత్యాసం ఉంచుతూ బ్యాలెట్ పేపర్‌లో మార్పు చేసేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.అనిల్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
Konda Vishweshwar Reddy Ballot Issue: పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం నుంచి పిటిషనర్‌తో పాటు 46 మంది నామినేషన్ దాఖలు చేశారని పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. పిటిషనర్ పేరు ఉన్న మరో వ్యక్తి కూడా నామినేషన్ దాఖలు చేశారని పేర్కొన్నారు. జాబితాలో సీరియల్ నెంబరు 2గా పిటిషనర్ పేరు ఉందని, అయిదో పేరుగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తండ్రి కాంతారెడ్డి అని ఉందని వివరించారు. పిటిషనర్ ప్రచారానికి వెళుతుంటే 5వ నెంబరు అభ్యర్థా అని అడుగుతున్నారని తెలిపారు. రెండు పేర్లు ఒకేచోట ఉన్నట్లయితే ఓటర్లు అయోమయంలో పడే అవకాశం ఉందన్నారు. తమ పేర్ల మధ్య కనీసం 10 నెంబర్లు వ్యత్యాసం ఉండేలా బ్యాలెట్ పేపరులో మార్పులు చేసేలా ఆదేశించాలని కోరారు. దీనికి సంబంధించి గత నెల 30న ఎన్నికల సంఘానికి వినతి పత్రం సమర్పించామని తెలిపారు.