Telangana Congress MP Candidates List 2024 : రాష్ట్రంలో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇంకా కొలిక్కిరానట్టు సమాచారం. మంగళవారం రోజున దిల్లీలో జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో 6 లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికపై మాత్రమే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ప్రధానంగా 13 నియోజకవర్గాలకు సంబంధించి పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా ఆరు నియోజకవర్గాలు మాత్రమే చర్చకు రావడం, అందులో భువనగిరి నియోజకవర్గ అభ్యర్థి ఎంపికపై ఏకాభిప్రాయం కుదరలేదని పార్టీ వర్గాలు తెలిపాయి.
లోక్‌సభ పోరుకు కాంగ్రెస్ రెడీ - రేపు ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్న ఏఐసీసీ
Telangana Lok Sabha Elections 2024: నాగర్‌కర్నూల్, చేవెళ్ల, మల్కాజ్‌గిరి, ఆదిలాబాద్, పెద్దపల్లి నియోజకవర్గాల అభ్యర్థులపై ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. నాగర్‌కర్నూల్ అభ్యర్థిగా మల్లు రవి, చేవెళ్ల అభ్యర్థిగా రంజిత్ రెడ్డి, మల్కాజ్‌గిరి అభ్యర్థిగా సునీతా మహేందర్ రెడ్డి, ఆదిలాబాద్ అభ్యర్థిగా ప్రొఫెసర్ కె. సుమలత, పెద్దపల్లి అభ్యర్థిగా గడ్డం వంశీ పేర్లను ఎంపిక చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. అభ్యర్థుల ఎంపికపై పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని ఏఐసీసీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.