Congress Leadership Focus on TPCC Selection : రాష్ట్ర కాంగ్రెస్‌లో పార్టీ పదవులతోపాటు మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీకి సమయం ఆసన్నమైంది. అసెంబ్లీ సమావేశాల ముందే ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్నా, సామాజిక సమతుల్యత విషయంలో ఏకాభిప్రాయం కుదరక తాత్కాలికంగా వాయిదా పడ్డట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే పెట్టుబడుల కోసం అమెరికా, దక్షిణ కొరియాల పర్యటనకు సీఎం బృందం వెళ్లడంతో పదవులు ఆశిస్తున్న నాయకులు వేచి చూస్తున్నారు. విదేశీ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి, బుధవారం హైదరాబాద్ రానున్నారు. మరుసటి రోజు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. 13 రోజులుగా విదేశాల్లో పర్యటించిన సీఎం, ఈ నెల 16న పాలనాపరమైన అంశాలపై దృష్టి సారిస్తారు. ఆ తర్వాత ఈ నెల 17న లేదంటే 18న దిల్లీ వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.
Cabinet Expansion in Telangana : పీసీసీ అధ్యక్ష పదవి కోసం పలువురు సీనియర్ నాయకులు పోటీ పడుతున్నారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీ బలరాం నాయక్, ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మాజీ ఎంపీ మధుయాష్కీ, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్‌లు.. పదవి ఆశిస్తున్న వారిలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు మంత్రివర్గంలో స్థానం కోసం ఏఐసీసీ కోటా కింద మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు, మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితోపాటు మరికొంత మంది ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. అయితే ఆరు మంత్రి పదవులు భర్తీ చేసే అవకాశం ఉన్నా, నాలుగు మాత్రమే ఇప్పుడు భర్తీ చేసే యోచన కనిపిస్తోంది.