BJP MP Candidates Second List :రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు గానూ ఇప్పటికే 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాషాయ పార్టీ(BJP), రెండో విడుతలో మిగిలిన 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలా? లేక కొన్ని స్థానాలకే అభ్యర్థులను ప్రకటించాలా? అనే సందిగ్ధంలో పడింది. కొన్ని లోక్‌సభ స్థానాల్లో పార్టీకి బలమైన అభ్యర్థులు లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వరంగల్, నల్లగొండ, మహబూబాబాద్, ఖమ్మం, పెద్దపల్లి స్థానాల్లో పార్టీ చాలా బలహీనంగా ఉంది.
అయితే ఈ స్థానాల్లో ఇతర పార్టీల నుంచి నేతలకు గాలం వేసి వారికి టికెట్లు కేటాయించాలని భావిస్తోంది. చేరికల ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేసే అవకాశముందని పార్టీలో చర్చ జరుగుతోంది. అనుకున్న సమయంలోగా చేరికలు పూర్తయితే మిగిలిన 8 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌లోపే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని పార్టీ భావిస్తోంది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో ప్రచారంపై దృష్టి పెట్టాలని యోచిస్తోంది.
Telangana BJP Parliament Candidates : ఇటీవల ప్రకటించిన తొలి జాబితాలో పలువురు సీనియర్లు టికెట్ ఆశించి భంగపడ్డారు. కొత్త వారికి పార్టీ అవకాశం కల్పించింది. చేరిన ఒకట్రెండు రోజుల్లోనే ఇద్దరు నేతలు టికెట్ దక్కించుకున్నారు. దీంతో మిగిలిన 8 స్థానాల్లో కొత్త వారికి అవకాశం కల్పిస్తారా? లేక పాత వారికి అవకాశం కల్పిస్తారా? అన్న ప్రశ్న అందరి మెదళ్లను తొలిచివేస్తోంది. జహీరాబాద్ స్థానాన్ని ఆశించి భంగపడిన ఆలె భాస్కర్ మెదక్(MEDAK) నుంచి పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్నారు.
భాష్కర్ తండ్రి ఆలె నరేంద్ర మెదక్ ఎంపీగా పనిచేశారు. దీంతో వారి కుటుంబానికి ఆ ప్రాంతానికి ఉన్న అనుబంధం కారణంగా ఆలె భాస్కర్ మెదక్ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ స్థానం కోసం రఘునందన్ రావు(Raghunandan Rao), అంజిరెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా మిట్టపల్లి సురేందర్‌కు పెద్దపల్లి టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.పెద్దపల్లి టికెట్‌ను పార్టీ సీనియర్ నేత, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ సైతం ఆశిస్తున్నారు.