Telangana BJP Bus Yatra 2024 : విజయ సంకల్ప యాత్ర(BJP Vijaya Sankalpa Yatra) పేరుతో బస్సు యాత్ర చేస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 20వ తేదీ నుంచి మార్చి 1 వరకు ఐదు బస్సు యాత్రలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. రాష్ట్రంలో 1,025 కిలోమీటర్లు మేర ఈ యాత్రలు కొనసాగుతాయని పేర్కొన్నారు. పదేళ్లలో ప్రధాని మోదీ సాధించిన విజయాలు, అదే పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలు, ఆరు దశాబ్ధాల కాలంలో కాంగ్రెస్ లోపాలను ప్రజలకు తెలిపే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు.
'కాంగ్రెస్ నేతల మాటలు కోటలు దాటుతున్నా - పనులు పార్టీ ఆఫీసూ దాటలేకపోతున్నాయి'
తెలంగాణలో బీజేపీ బస్సు యాత్రల పేర్లు, వివరాలు :
క్రమ సంఖ్య | యాత్ర పేరు | నిర్వహించే నియోజకవర్గాలు |
1 | కొమురం భీమ్ యాత్ర | అదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ |
2 | శాతవాహన యాత్ర | కరీంనగర్, మెదక్, జహీరాబాద్, చేవెళ్ల |
3 | కాకతీయ యాత్ర | ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ |
4 | కృష్ణమ్మ యాత్ర | మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ |
5 | భాగ్యనగర యాత్ర | భువనగిరి, మల్కాజిగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్ |
Kishan Reddy On Lok Sabha Elections 2024: రాష్ట్రంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలు, 33 జిల్లాలో చేసే విధంగా యాత్ర ఉంటుందని కిషన్రెడ్డి తెలిపారు. 17 సీట్లు కచ్చితంగా గెలుస్తామని, హైదరాబాద్లో ఎంఐఎం పార్టీను ఓడిస్తామని దీమా వ్యక్తం చేశారు. ముఖ్య నేతలు అందరూ పాల్గొనే విధంగా కార్యాచరణ ఉంటుందన్నారు. మండల, నియోజకవర్గాలు వారీగా రోడ్ షోలు ప్రధానంగా ఉంటాయని వెల్లడించారు. అన్ని యాత్రలు భాగ్యనగరంలో కలిసే విధంగా ప్రణాళికలు రూపొందించామని వివరించారు. యాత్రకు సంబంధించిన పోస్టర్(BJP Bus Yatra Poster)ను బీజేపీ నేతలతో కలిసి ఆవిష్కరించారు.