Pinnelli Paisachikam Book Released By TDP Leaders : పల్నాడు జిల్లా మాచర్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడి మాఫియాపై తెలుగుదేశం పుస్తకం విడుదల చేసింది. పిన్నెల్లి పైశాచికం పేరుతో విడుదల చేసిన ఈ పుస్తకంలో ఏళ్లుగా మాచర్లలో సోదరులు చేసిన అరాచకాలను కళ్లకు కట్టింది. ముఖ్యంగా 2019 నుంచి ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలపై దాడులు, దాష్టీకాలను వివరించింది. అదే సమయంలో పిన్నెల్లి అక్రమార్జనను సైతం పేర్కొంది.
రూ.2 వేల కోట్లు దోపిడి :‘పిన్నెల్లి పైశాచికం’ పేరుతో తెలుగుదేశం 28 పేజీలతో రూపొందించిన పుస్తకం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మాచర్ల నియోజకవర్గాన్ని ప్రైవేటు ఎస్టేటుగా మార్చుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు అక్కడ సహజ వనరులను కొల్లగొట్టారని టీడీపీ పార్టీ ధ్వజమెత్తింది. ప్రశ్నించిన వారిపై పైశాచికంగా దాడులకు పాల్పడి మారణహోమం సృష్టించారని తెలుగుదేశం నాయకులు ఆరోపించారు. ప్రజలంతా తమ బానిసలనే విధంగా మాచర్లలో ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని వేధించారని వ్యాఖ్యానించారు. పిన్నెల్లి దోపిడీ రూ. 2 వేల కోట్లని ఆరోపించింది. ‘2011-12 సంవత్సరంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆదాయం రూ. 1.95 లక్షలుంటే ఇప్పుడు అధికారికంగా రూ. 43 లక్షలు చూపిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఒక కేసులో అరెస్టొద్దంటే మొత్తానికే వదిలేస్తారా?- పిన్నెల్లిపై పోలీసుల స్వామిభక్తి - PINNELLI CASES
పిన్నెల్లి ఆస్తులు అనధికారికంగా ఏటా రూ. 250 కోట్లకుపైనే ఉంటుందని పుస్తకంలో తెలిపింది. అప్పులతో ఊరొదిలి పారిపోయిన పరిస్థితి నుంచి వేల కోట్లకు పడగలెత్తారని పేర్కొంది. అధికారికంగా ప్రకటించిన ఆస్తుల వివరాలను అందులో వివరించారు. రెంటాలలో తెలుగుదేశం ఏజెంటుగా ఉన్న చేరెడ్డి మంజులపై దాడి చేసి తలకు తీవ్ర గాయం చేయడం, కారంపూడిలో తెలుగుదేశం కార్యాలయ ధ్వంసం, పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం తదితర చిత్రాలు పుస్తకంలో ఉన్నాయి.