TDP Aspirants meet Chandrababu:తెలుగుదేశం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్న నేతలు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇంటికి క్యూకట్టారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆశావహులు ఆయన్ను కలుస్తున్నారు. తమ సీటు విషయమై చర్చించి వారు ఆశిస్తున్న స్థానాలను వారికే కేటాయించాలని చంద్రబాబును కోరారు. నిన్ననే పసుపు కండువా కప్పుకున్న మాజీమంత్రి గుమ్మనూరు జయరాం చంద్రబాబుతో భేటీ అయ్యారు. గుమ్మనూరు గుంతకల్లు స్థానం ఆశిస్తున్నారు. పార్టీ సీనియర్ నేత కళా వెంకట్రావ్ కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఎచ్చర్ల స్థానంపై అధినేతతో చర్చించారు.
టీడీపీలోకి గుమ్మనూరు: వైసీపీకి రాజీనామా చేశాక బర్తరఫ్ చేసినా ఏం చేసినా తనకు అనవసరమని మాజీమంత్రి గుమ్మనూరు జయరాం (Gummanur Jayaram) అన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసమే మనస్ఫూర్తిగా తెలుగుదేశంలో చేరినట్లు స్పష్టం చేశారు. గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో చంద్రబాబు సమక్షంలో భారీగా వైసీపీ శ్రేణులు పసుపు తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచే చేస్తానని గుమ్మనూరు చెప్పారు. అయితే ఇన్నాళ్లూ ఆలూరుకు సేవలందించానని ఇప్పుడు గుంతకల్లు నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు తన మనసులో మాటను బయటపెట్టారు జయరాం.
విభేదాలు పక్కనపెట్టి విజయానికి కృషి చేయండి- కష్టపడే ప్రతి ఒక్కరికీ అవకాశం: చంద్రబాబు
సంతృప్తిగా సోమిరెడ్డి: సర్వేపల్లిలో రకరకాల పేర్లతో సర్వేలు చేయించడం వల్ల కేడర్ గందరగోళంలో పడుతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) అన్నారు. అధినేత చంద్రబాబుతో భేటీ అనంతరం ఆయన సంతృప్తిగా బయటకొచ్చారు. ప్రస్తుతం సర్వేపల్లి టీడీపీ ఇన్ఛార్జిగా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఉన్నారు.