Barrelakka MP Election Nomination :నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా సోషల్మీడియా సెన్సేషన్ బర్రెలక్క నామినేషన్ వేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి రాష్ట్ర ప్రజలనే కాకుండా ఇరు తెలుగు రాష్ట్రాల వారి దృష్టిని ఆకర్షించిన బర్రెలక్క, తాజాగా నాగర్ కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఒక సెట్టు నామినేషన్ పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉదయ్ కుమార్కు అందజేశారు.
MP Election Nomination Filed by Barrelakka :నామినేషన్ దాఖలు చేసిన అనంతరం బర్రెలక్క మీడియాతో మాట్లాడారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేశానని ఆమె తెలిపారు. పార్లమెంట్ పరిధిలోని ఓటర్లందరూ తనకు ఓటు వేసి గెలిపించాలని ఆమె ఈ సందర్భంగా కోరారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే, నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తానని, వారి అభివృద్ధి కోసం అహర్నిషలు శ్రమిస్తానని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు తనను గెలిపించడం కోసం శ్రమించారని పార్లమెంటు ఎన్నికల్లో కూడా అలాగే తన గెలుపు కోసం ప్రోత్సహించాలని ఆమె కోరారు.
"అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి కొన్ని గ్రామాలు సందర్శించాను. అక్కడ సరైన రోడ్డు సదుపాయాలు లేవు. మాలాంటి నిరుద్యోగులు చట్ట సభల్లో ఉండాలనేది నా ఆకాంక్ష. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తా." - బర్రెలక్క అలియాస్ శిరీష, ఎంపీ స్వతంత్ర అభ్యర్థిని నాగర్ కర్నూల్