Secunderabad Lok Sabha Election 2024 : లోక్‌సభ ఎన్నికల్లో ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచే స్థానం సికింద్రాబాద్ నియోజకవర్గం. ఇక్కడ ముగ్గురు దిగ్గజాలు పోటీపడుతున్న సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక్కడ ప్రధాన పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు నువ్వానేనా అన్నట్లు ప్రచారంలో దూసుకుపోతున్నారు. నాయకులు మాటల తూటాలతో ఓటరును తమవైపు తిప్పుకునేందుకు శ్రమిస్తున్నారు. సికింద్రాబాద్ స్థానానికి ఇద్దరు ఎమ్మెల్యేలు లోక్‌సభ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.
సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన పద్మారావు గౌడ్, ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరి హస్తం పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు. వీరిద్దరూ తొలిసారిగా ఎంపీలుగా పోటీచేస్తున్నారు. ఒకేపార్టీ నుంచి ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్యేలు లోక్‌సభ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోటీపడుతున్నారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రెండోసారి సికింద్రాబాద్ నుంచి అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
కాంగ్రెస్ గెలుపు వ్యూహం : సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలో 7 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో ఒక్క స్థానం ఎంఐఎం మినహా మిగతా అన్నింటా బీఆర్ఎస్దే విజయం. ఖైరతాబాద్‌లో బీఆర్ఎస్ గెలిపిచినప్పటికీ దానం నాగేందర్ పార్టీ మారి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డారు. బల్దియా మేయర్ గద్వాల విజయలక్ష్మి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్దీన్‌లు అధికార పార్టీ గూటికి చేరారు. నాంపల్లి మినహా సికింద్రాబాద్, ముషీరాబాద్, సనత్ నగర్, అంబర్ పేట్, కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఖాతాలోనే ఉన్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్‌లోకి పెరుగుతున్న చేరికలతో పార్టీ బలం పుంజుకుంటోంది. సికింద్రాబాద్‌ను ఒడిసిపట్టాలనే పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. ప్రభుత్వ పథకాలను ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు.
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపు బీఆర్ఎస్దే : పద్మారావు గౌడ్
"యువకులు ఎప్పుడైతే ముందుకొచ్చి పని చేస్తారో మేం అలసిపోయినా మిమ్మల్ని చూడగానే కొత్త ఎనర్జీ వస్తుంది. పక్క పార్టీల కంటే కాంగ్రెస్‌లో యువకులు చాలా యాక్టివ్‌గా ఉంటారు. కష్టం చేసినప్పుడే సరైన సమయంలో మీకు దక్కాల్సిన ప్రతిఫలం అనేది దక్కుతుంది." - దానం నాగేందర్, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి