Secunderabad BRS MP Candidate Padma Rao Goud :అసెంబ్లీ ఫలితాలు పార్లమెంట్ ఎన్నికల్లో పునరావృతం కాకుండా బీఆర్ఎస్ జాగ్రత్త పడుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించాలని ఉవ్విళ్లూరుతోంది. ఆ దిశగా కార్యాచరణను ముమ్మరం చేస్తోంది. ఓవైపు ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతూనే మరోవైపు విడతల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తోందని. గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ వరుసగా లోక్‌సభ నియోజకవర్గాలపై సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో ఆయా నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటిస్తున్నారు.
ఇప్పటి వరకు 13 స్థానాలకు లోక్‌సభ అభ్యర్థుల (BRS Lok Sabha Candidates)ను ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ తాజాగా మరో ఎంపీ అభ్యర్థి పేరును ఖరారు చేశారు. తాజాగా సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. మాజీ మంత్రి పద్మారావు గౌడ్‌కు ఈ స్థానం నుంచి ఎంపీ టికెట్ ఇచ్చింది. పద్మారావు గౌడ్ పేరును పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. మరోవైపు ఈ స్థానంలో కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి బరిలో నిలిచారు.
BRS Lok Sabha Candidates in Telangana 2024 :పార్టీ సీనియర్ నేతగా నాటి ఉద్యమ కాలం నుంచి నేటి వరకు పార్టీకి విధేయుడుగా ఉన్న పద్మారావు గౌడ్ అందరివాడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సికింద్రాబాద్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన, నిబద్ధత కలిగిన నేతగా పేరుగాంచారు. స్థానిక నేతగా ఆ ప్రాంత ప్రజలు బస్తీవాసులందరికీ పజ్జన్నగా ఆదరాభిమానాలు పొందిన పద్మారావు గౌడ్ ఈ స్థానానికి సరైన ఎంపిక అని పార్టీ అధినేతతో పాటు స్థానిక నేతలు కూడా భావించారు. ఈ నేపథ్యంలో పద్మారావు గౌడ్ (BRS MP Candidate Padma Rao Goud)ను సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఆమోదించినట్లు పేర్కొన్నారు. అందరి ఏకాభిప్రాయం మేరకే పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.