Nara Lokesh Prajadarbar : మంత్రి నారా లోకేశ్ చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉండవల్లిలోని ఆయన నివాసానికి తరలివస్తున్న జనం తమ సమస్యలను ఏకరువు పెడుతున్నారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగాన్ని లోకేశ్ ఏర్పాటు చేశారు. విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రజల కోసమని ప్రత్యేకంగా తనదైన శైలిలో మొదలు పెట్టిన ప్రజాదర్బార్ కు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వినతులు వెల్లువెత్తుతున్నాయి.
కేవలం వినతి పత్రాలు తీసుకోవడంతోనే తమ బాధ్యత తీరినట్లుగా భావించకుండా సంబంధిత అర్జీలను ఆయా శాఖలకు పంపి వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేకమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో 12వ రోజు కొనసాగిన “ప్రజాదర్బార్”కు మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తమ సమస్యలను చెప్పుకొనేందుకు భారీగా తరలివస్తున్నారు.
ప్రజలకు భరోసా కల్పిస్తోన్న ప్రజాదర్బార్ - నేనున్నానంటున్న నారా లోకేశ్ - Nara Lokesh Prajadarbar
యువనేతను నేరుగా కలిసి తమ కష్టాలు ఏకరవు పెట్టారు. పెన్షన్ ల కోసం వృద్ధులు, వికలాంగులు, మహిళలు, ఉద్యోగాల కోసం యువత, సమస్యల పరిష్కారం కోసం వివిధ విభాగాల ఉద్యోగాలు, విద్య, వైద్య సాయం కోసం సామాన్యులు, తాము ఎదుర్కొంటున్న కష్టాల నుంచి గట్టెక్కేందుకు బాధితులు పెద్దఎత్తున తరలి వచ్చారు. ఆయా సమస్యలను విన్న మంత్రి లోకేశ్ వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.