Vizag Steel Plant Discussion in Legislative Council: విశాఖ ఉక్కు పరిశ్రమ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ జరగదని శాసనమండలి సాక్షిగా మంత్రులు తేల్చిచెప్పారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తున్నారంటూ వైఎస్సార్సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు అమాత్యులు ఈ మేరకు సమాధానమిచ్చారు. మరోవైపు వైద్య కళాశాలపై అధికార, విపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలతో మండలి దద్దరిల్లింది.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై శాసనమండలిలో వాడీవేడి చర్చ సాగింది. ఉక్కు పరిశ్రమ ప్రవేటీకరణపై వైఎస్సార్సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, టీజీ భరత్ దీటుగా సమాధానమిచ్చారు. ప్రైవేటీకరణ వద్దంటూ తీర్మానం చేయాలని కోరగా ప్రైవేటీకరణ అంశమే లేనప్పుడు తీర్మానం ఎందుకని అచ్చెన్న ప్రశ్నించారు.
మెడికల్ కాలేజీలపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం: వైద్య కళాశాలలపై జరిగిన చర్చతో శాసనసభ అట్టుడికింది. మెడికల్ కాలేజీల్లో గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ మంత్రి సత్యకుమార్ వాడిన ఓ సామెతపై వైఎస్సార్సీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ వ్యాఖ్యలు తప్పనిపిస్తే వెనక్కి తీసుకుంటానని సత్యకుమార్ స్పష్టం చేయడంతో వివాదానికి తెర పడింది.
అదానీ లంచం కేసు - వైఎస్సార్సీపీ సర్కార్కు భారీగా ముడుపులు
కాలుష్య నియంత్రణకు చర్యలు: విశాఖలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు కాలుష్య నియంత్రణ మండలి అధ్యయన నివేదిక రాగానే చర్యలు చేపడతామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ మేరకు సమాధానం ఇచ్చారు. విశాఖ తీరంలో వాయు కాలుష్య స్థాయి 7 రెట్లు పెరిగిందన్న పవన్ కాలుష్య నియంత్రణకు చర్యలు చేపడుతున్నామన్నారు. డిసెంబర్ మొదటి వారంలో క్షేత్రస్థాయిలో పర్యటించి కాలుష్యం కారణాలను అన్వేషిస్తామని వెల్లడించారు.
వైఎస్సార్సీపీ సభ్యులపై చైర్మన్ ఆగ్రహం: విశాఖ ప్రైవేటీకరణపై చర్చించేందుకు తమకు అవకాశం ఇవ్వాలని వైఎస్సార్సీపి సభ్యులు ఆందోళనకు దిగడంపై శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన మండలిలో వైఎస్సార్సీపి సభ్యులు అడిగిన అన్ని ప్రశ్నలకు మంత్రులు స్పష్టంగా సమాధానాలు చెప్పినా పోడియం వద్దకు వచ్చి ఆందోళన చేయడంతో అసహనానికి గురయ్యారు. తరచూ శాసన మండలిలో వైఎస్సార్సీపి సభ్యులు పోడియం వద్దకు వచ్చి ఆందోళన చేయవద్దని ఆదేశించారు. మీరు లేచి గొడవ చేస్తే నేను మైక్ ఇవ్వాలా అన్న చైర్మన్ సభలో వైఎస్సార్సీపి సభ్యులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అప్పటికీ సభ్యులు ఆందోళన కొనసాగించడంతో సభను కాసేపు వాయిదా వేశారు.
మీ ఆటలు సాగవు - భూకబ్జాలకు పాల్పడితే కఠినశిక్ష: సీఎం చంద్రబాబు
తొలిసారి పీఏసీ ఛైర్మన్ ఎన్నిక - బలం లేకపోయినా వైఎస్సార్సీపీ నామినేషన్