PAC Chairman Elections in AP : తెలుగు రాష్ట్రాల చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ (పీఏసీ) ఎంపికకు తొలిసారి ఎన్నిక జరుగనుంది. సభలో ప్రతిపక్షం లేకపోవడంతో సంఖ్యా బలం ప్రకారమే పీఏసీ ఎన్నికకు వెళ్లాలని ఎన్డీయే కూటమి నిర్ణయించింది. తగినంత సంఖ్యాబలం లేకపోయినా వైఎస్సార్సీపీ నుంచి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక ప్రక్రియ రసవత్తరంగా మారింది.
ఎన్డీయే ఎమ్మెల్యేల నామినేషన్ : ప్రజా పద్దుల కమిటీ చైర్మన్‌గా (పీఏసీ) జనసేన ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు ఎన్నిక దాదాపు ఖరారు అయ్యింది. ఈయన మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు. వైఎస్సార్సీపీ నామినేషన్ ఉపసంహరణ జరకపోతే శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో పీఏసీ సభ్యత్వానికి పోలింగ్ జరగనుంది. బ్యాలెట్ పద్దతిలో శుక్రవారం సభ జరిగే సమయంలోనే అసెంబ్లీ కమిటీ హాల్‌లో పోలింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు.
తెలుగుదేశం తరఫున పీఏసీ సభ్యత్వానికి జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి, తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధా కృష్ణ, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు, ఎస్ కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి నామినేషన్లు వేశారు. జనసేన తరఫున పులపర్తి ఆంజనేయులు నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ తరఫున పీఏసీ సభ్యత్వానికి విష్ణు కుమార్ రాజు నామినేషన్ వేశారు.
ఓటింగ్‌కు ఎమ్మెల్యేలంతా అందుబాటులో ఉండాలని టీడీఎల్పీ సమాచారం ఇచ్చింది.
పీఏసీ ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ - పెద్దిరెడ్డి నామినేషన్ దాఖలు
రామచంద్రారెడ్డి నామినేషన్ : వైఎస్సార్సీపీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేశారు. వైఎస్సార్సీపీకి తగినంత సంఖ్యా బలం లేకపోవటంతో ఎన్డీయే అభ్యర్థుల ఎన్నిక లాంఛనం కానుంది. ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యాక పీఏసీ చైర్మన్‌గా పులపర్తి ఆంజనేయులు పేరును స్పీకర్ ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ (పీయూసీ) చైర్మన్‌గా ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, అంచనాల కమిటీ ( ఎస్టిమేట్స్) ఛైర్మన్ గా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ను ఎంపిక చేయనున్నట్లు సమాచారం.
సంఖ్యాబలం లేకపోయినా నామినేషన్‌ను దాఖలు : ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశాక అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తూ వస్తున్న వైఎస్సార్సీపీ సభ్యులు ఇప్పుడు కేబినేట్‌తో సమాన హోదా కలిగిన ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పదవి కావాలంటూ నామినేషన్ దాఖలు చేశారు. ప్రజాపద్దుల కమిటీ (PAC), అంచనాల కమిటీ (Estimates), ప్రభుత్వరంగ సంస్థల కమిటీ (PUC)లకు సభ్యుల ఎన్నిక ప్రక్రియను బుధవారం సభలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు. ఈ ప్రకటనకు అనుగుణంగా ఒక్కో కమిటీలో 9మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎమ్మెల్సీల చొప్పున మొత్తం 12 మందిని ఎన్నిక ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తారు. గురువారం మధ్యాహ్నం ఒంటిగంట వరకూ నామినేషన్ల దాఖలుకు గడువిచ్చారు. ఒక్కో కమిటీ సభ్యత్వానికి దాదాపు 20మంది ఎమ్మెల్యేల బలం అవసరం ఉంటుంది.
ఎన్నికైన సభ్యత్వాలకు అనుగుణంగా ఆయా పార్టీలతో మాట్లాడి ఛైర్మన్‌ను స్పీకర్ ప్రకటిస్తారు. వీటిల్లో కీలకమైన పీఏసీ ఛైర్మన్ పదవి ప్రధాన ప్రతిపక్ష పార్టీ సభ్యుడికి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో 93శాతం స్ట్రైక్ రేట్‌తో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి అఖండ విజయం సాధించడంతో ప్రతిపక్షహోదా వైఎస్సార్సీపీకి దక్కలేదు. అయినా ప్రతిపక్ష హోదా ఇస్తేనే తాము సభకు వస్తామంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలని బహిష్కరిస్తూ వస్తున్నారు. గురువారం పీఏసీ సభ్యత్వానికి ఎన్డీయే కూటమి తరుపున తెలుగుదేశం-జనసేన-బీజేపీల నుంచి 9మంది ఎమ్మెల్యేలు నామినేషన్ దాఖలు చేశారు. అనూహ్యంగా వైసీపి తరుపున పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 10వ నామినేషన్ దాఖలు చేయడంతో పోటీ అనివార్యమైంది. తగినంత సంఖ్యాబలం లేకపోయినా వైఎస్సార్సీపీ నామినేషన్ దాఖలు చేసింది.
జగన్ వస్తారా : తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ చరిత్రలో ఇప్పటివరకూ ఈ కమిటీలకు ఎన్నిక ప్రక్రియ ఏకగ్రీవంగానే జరిగింది. 11మంది సభ్యులే ఉన్న వైఎస్సార్సీపీ నామినేషన్ దాఖలు చేయడంతో తొలిసారి పోటీ అనివార్యమవుతోంది. ఓటింగ్‌లో పాల్గొనేందుకైనా ఆ 11మంది సభకు వస్తారా, రారా అనే చర్చ అసెంబ్లీ లాబీల్లో జోరందుకుంది.
"ఎన్నికల్లో పోటీకే భయపడే పరిస్థితి" - ఘోర పరాభవాన్ని మర్చిపోలేకపోతున్న వైఎస్సార్సీపీ