AI Powered Smart Glasses For Blind People : చేతి కర్ర సాయం లేనిదే అంధులు గడప దాటలేరనేది సర్వసాధారణం. వారు ఇంట్లో తిరగాలన్నా చేతి కర్ర కావాల్సిందే. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు సాంకేతికత అభివృద్ధి చెందాక అంధుల కోసం వివిధ రకాల టూల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లలో ప్రత్యేక యాప్‌లతోనూ అంధులు చదవగలుగుతున్నారు, రాయగలుగుతున్నారు. ఎవరి సాయం లేకుండా బయటకు వెళ్లగలుగుతున్నారు. మరో అడుగు ముందుకేస్తూ తాజాగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత కళ్లద్దాలు అందుబాటులోకి వచ్చాయి.
అంధులు ఈ ఏఐ ఆధారిత కళ్లద్దాలు ధరిస్తే చాలు చేతి కర్ర ఊతం, ఇతరుల సాయం లేకుండా వారి పనులు చేసుకోగలరు. అదేవిధంగా ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు ఇవి వీరికి దారి చూపిస్తాయి. పుస్తకంలోని అక్షరాలను 'టెక్స్ట్ టు స్పీచ్' సాయంతో ఈ అద్దాలే చదివి వినిపిస్తాయి. ఈ సరికొత్త కళ్లద్దాలకు కిమ్స్ ఫౌండేషన్, పరిశోధన కేంద్రం, డీఆర్‌డీవో మాజీ శాస్త్రవేత్త డాక్టర్ వి.భుజంగరావు ఆధ్వర్యంలో రూపకల్పన చేశారు. తాజాగా గురువారం తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కిమ్స్ ఆస్పత్రి సీఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు, ఎల్వీప్రసాద్ కంటి ఆసుపత్రి వ్యవస్థాపక ఛైర్మన్, ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ జీఎన్‌రావు చేతుల మీదుగా వీటిని ఆవిష్కరించారు.
ఇన్‌స్టాలో ఏఐ ప్రొఫైల్ పిక్చర్ జనరేషన్ ఫీచర్!- ఇది ఎలా పనిచేస్తుందంటే?
మొదటి విడతలో భాగంగా 100 మంది అంధ విద్యార్థులకు ఈ కళ్లద్దాలను పంపిణీ చేశారు. ప్రయోగాత్మక పరిశీలన కింద వినియోగించిన తర్వాత మరింత సాంకేతికతతో వీటిని తీర్చిదిద్దనున్నట్లు డాక్టర్ వి.భుజంగరావు ‘ఈనాడు’కు తెలిపారు. ప్రస్తుతం ఒక్కో జత తయారీ కోసం రూ.10 వేల వరకు ఖర్చవుతోందని తెలుపుతున్నారు. అయినప్పటికీ తొలుత వీటిని ఎలాంటి లాభాపేక్ష లేకుండానే అందిస్తున్నామని వివరించారు. వీటి బరువు 45 గ్రాముల వరకు ఉంటుందని, సాంకేతికత అభివృద్ధి చేసేకొద్దీ ధర తగ్గడమే కాకుండా, మరింత తేలికగా తయారుచేస్తామని డాక్టర్ వి.భుజంగరావు తెలిపారు.
ఈ ఏఐ ఆధారిక కళ్లద్దాలు ఎలా పనిచేస్తాయంటే
- ఏఐ ఆధారిత స్మార్ట్ కళ్లద్దాల్లో మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్, అత్యాధునిక కంప్యూటర్ విజన్ ఉపయోగించారు. ఇవి అంధులకు అసాధారణ సేవలు అందిస్తాయి. ఇందులో యూఎస్‌బీ, బ్యాటరీ ఉంటాయి. దీని వినియోగం కోసం ప్రత్యేక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సెల్‌ఫోన్‌లా ఛార్జింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
- ఇందులో అమర్చిన చిప్ సహాయంతో వ్యక్తుల ముఖాలు, ముఖ్యమైన ప్రదేశాలు , ఇంటి చిరునామా వంటి అవసరమైనవి ముందే ఇందులో నిక్షిప్తం చేయవచ్చు. దీంతోపాటు 400 మంది వరకు వ్యక్తుల ముఖాలను యూఎస్‌బీ మెమొరీలో పేర్లతో స్టోర్ చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులు, బంధువులు,స్నేహితులు ఇలా అందరినీ ఇందులో నిక్షిప్తం చేయడం వల్ల వారు తారసపడిన సందర్భంలో పేరుతో సహ ఇవి గుర్తించి ఎదురుగా ఉన్న వ్యక్తుల గురించి సమాచరం అందించి అప్రమత్తం చేస్తాయి.
- కళ్లద్దాల్లోని యాప్‌లో ఉన్న 'టెక్స్ట్‌టు స్పీచ్ లాంటి రీడింగ్ అసిస్టెంట్'తో పుస్తకంలోని టెక్స్ట్‌ను చదివి వినిపిస్తాయి. దీంతో కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు బోర్డులు చదవడం, పుస్తకాలు చదువుకోవడం, ఇతరులతో కమ్యూనికేషన్ చేయడం మరింత సులువవుతుంది.
- ముందే ఇంటి తోపాటు పని చేసే కార్యాలయం, చదువుకునే కళాశాల లాంటి ప్రదేశాలను ఇందులో నిక్షిప్తం చేయడం వల్ల ఆయా ప్రాంతాలకు వెళ్లాలనుకుంటే మార్గనిర్దేశం చేస్తాయి. ఎటునుంచి ఎటు వెళ్లాలో దారి చూపిస్తాయి. వారు నివసించే ఇంటిలో పార్కింగ్ దగ్గర నుంచి తమ గమ్యస్థానానికి సులువుగా చేరుకోవడానికి ఇవి సాయం చేస్తాయి.
- నడిచేటప్పుడు ముందు ఏదైనా అడ్డంగా ఉంటే అప్రమత్తం చేయడమే కాకుండా సరైన మార్గాన్ని గుర్తించి ముందే తెలియజేస్తాయి.