MP Candidates Election Campaign : లోక్‌సభ ఎన్నికలకు పార్టీలు ప్రచారాన్నిముమ్మరం చేశాయి. కాంగ్రెస్ ముఖ్యనేతలు కార్యకర్తలతో సమావేశమవుతూ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి గడ్డం వంశీకృష్ణ తరపున మంత్రి శ్రీధర్‌బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్, పదేళ్ల పాలన అవినీతి ఆరాచకాలతోనే సాగిందని మంత్రి ఆరోపించారు.
BRS Election Campaign :జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ, కొత్తపల్లి, మొగుళ్లపల్లి, మండలాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు. మహబూబాబాద్ లోక్‌సభ పరిధిలోని భద్రాచలంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరావు పాల్గొన్నారు. కచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని బలరాం నాయక్ కేంద్రమంత్రి అవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
" రైతులు పంటలు నష్టపోతే గతంలో పంటల బీమా సౌకర్యం ఉండేది కాదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో బీమాను వర్తింపచేయడానికి కృషిచేస్తుంది. రైతులు నష్టపోతే పంటల బీమా ఇచ్చే బాధ్యత రాష్ట్రప్రభుత్వం తీసుకుంటుంది. గతంలో బ్యాంకులో రుణం తీసుకునేవారికే ఈ బీమా చెల్లించేవారు. నష్టపోయిన ప్రతిరైతుకు పరిహారం చెల్లించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రభుత్వం ప్రజలకు మేలు చేసేదే తప్ప ఇబ్బంది పెట్టేది కాదు అని తెలియజేస్తున్నా. ఎక్కువ సీట్లు గెలిస్తేనే కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునేందుకు వీలుంటుంది".- తుమ్మల నాగేశ్వర రావు, మంత్రి