తెలంగాణ

telangana

ETV Bharat / politics

రసవత్తరంగా మారిన ఓరుగల్లు ఎన్నికల పోరు - విమర్శ ప్రతివిమర్శలతో హోరెత్తిస్తున్న ప్రచారాలు - Warangal Election Campaign - WARANGAL ELECTION CAMPAIGN

Warangal MP Seat 2024 : ముగ్గురు గులాబీగూటి నుంచి వచ్చిన వారే, నిన్నటి వరకు మిత్రులుగా ఉండి ఒకే వేదికను పంచుకున్నవారే నేడు ప్రత్యర్ధులుగా మారారు. ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. వ్యక్తిగత విమర్శలతో మాటలయుద్ధం చేస్తున్నారు. ఎవరికీ వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ ప్రచారంలో దూసుకుపోతుండగా అభ్యర్ధుల గెలుపును కాంక్షిస్తూ అగ్రనేతలు రావడంతో ఓరుగల్లు రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఈసారి పోరులో ఓరుగల్లు కోటపై పాగావేసేవారెవరో తేల్చేందుకు ప్రజలు తమ తీర్పుతో సన్నద్ధంగా ఉన్నారు.

Warangal Lok Sabha Elections 2024
Warangal MP Seat 2024

By ETV Bharat Telangana Team

Published : May 1, 2024, 8:11 PM IST

రసవత్తరంగా మారిన ఓరుగల్లు ఎన్నికల పోరు - విమర్శ ప్రతివిమర్శలతో హోరెత్తిస్తున్న ప్రచారాలు

Warangal Lok Sabha Elections 2024 : చారిత్రక నగరంగా వారసత్వ సంపదకు నిలయంగా ఉన్న ఓరుగల్లులో రాజకీయ చైతన్యం ఎక్కువ. ఏ ఎన్నికల్లోనైనా నువ్వానేనా అన్న రీతిలోనే పోరుసాగడం ఓరుగల్లుకే సొంతం. గత అసెంబ్లీ ఎన్నికల్లో 12లో 10 స్ధానాలను కాంగ్రెస్‌కు కట్టపెట్టి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మద్దతుగా నిలిచారు ఓరుగల్లు వాసులు. పార్లమెంట్‌ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు నుంచే ఎన్నో మలుపులు చోటుచేసుకున్న వరంగల్‌ రాజకీయం రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేకేత్తించింది.

నిన్నటివరకు ఒకే పార్టీలో ఉండి, ఆ తర్వాత రాత్రికి రాత్రి మరోపార్టీలో చేరారు స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య. బీఆర్​ఎస్​ నుంచి తొలుత అభ్యర్ధిగా నిలిచినా మారిన రాజకీయ పరిస్ధితులతో పోటీ చేయలేనని బరిలో నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత మరో రెండురోజులకే కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ అభ్యర్ధిగా తిరిగి పోటీలోకి వచ్చారు. వర్ధన్నపేట నుంచి గత ఎన్నికల్లో ఓటమి పాలైన అరూరి రమేశ్‌, పోనుపోనంటూనే గులాబీ పార్టీ వీడి కమలం పార్టీలో చేరి అక్కడ నుంచి పోటీకి దిగారు.

బీఆర్​ఎస్​ మూలాలున్న ప్రత్యర్ధుల పోటీ ​:కడియం కావ్య రాజీనామాతో విస్తృత కసరత్తు చేసిన గులాబీ దళపతి, విధేయతను దృష్టిలో పెట్టుకొని హనుమకొండ జడ్పీ ఛైర్మన్ మారపల్లి సుధీర్ కుమార్‌ను బరిలో దించారు. బీఆర్​ఎస్​ మూలాలున్న ముగ్గురు నేడు లోక్‌సభ సమరంలో ప్రత్యర్ధులుగా తలపడతున్నారు. ఈ ముగ్గురు తొలిసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

కాకలు తీరిన రాజకీయానికి కదిలించే పోరాటాలకు దిక్సూచిలా మారిన వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. ఈ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటి వరకు 20 సార్లు ఎలక్షన్స్ జరిగాయి. ఇందులో ఏడు సార్లు కాంగ్రెస్, నాలుగు సార్లు తెదేపా, మూడు సార్లు బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. పీడీఎఫ్‌, సీపీఐ, బీజేఎస్‌, బీఎల్‌డీ, జనతా, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు ఒక్కోసారి గెలిచారు. ఇలా వరంగల్ లోక్‌సభ స్థానం పరిధిలోని ఓటర్లు అన్ని పార్టీలను అక్కున చేర్చకున్నారు.

తమ విలక్షణమైన తీర్పు ద్వారా అందరినీ ఆదరించారు. ఈ పార్లమెంటులో ఒక్కప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట, రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా ఓటర్లు స్పందించారు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీకి, తదనంతరం బీఆర్ఎస్​కు పెద్ద పీట వేశారు. తమకు నచ్చిన అభ్యర్థిని ఒకటి కన్నా ఎక్కువసార్లు గెలిపించారు, నచ్చని వారిని నిర్మొహమాటంగా తిరస్కరించారు. 2004లో నుంచి తెలంగాణ ఉద్యమం ప్రభావంతో బీఆర్​ఎస్​ ఈ స్థానంలో తన బలాన్ని పెంచుకున్నది.

పోటాపోటీగా ఎంపీ అభ్యర్థుల ప్రచారం : కాంగ్రెస్, బీజేపీ, బీఆర్​ఎస్​ మూడు పార్టీల అభ్యర్ధులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో వాకర్స్​ను కలుసుకుని ఓట్లు అభ్యర్ధిస్తున్నారు. నియోజకవర్గాల విస్తృత స్ధాయి సమావేశాల్లో పాల్గొంటున్నారు. గతంతో పోలిస్తే ఈసారి వ్యక్తిగత దూషణలూ పెరిగాయి. కావ్య కులాన్ని, స్ధానికతను ప్రస్తావిస్తూ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేశ్​ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. కావ్య కూడా, ఆరూరి రమేశ్ భూకబ్జా కోరంటూ ఎదురుదాడికి దిగారు. చారిత్రక నగరం ప్రజలు చారిత్రాత్మక విజయం అందిస్తారని బీఆర్​ఎస్​ అభ్యర్ధి సుధీర్ కుమార్ చెపుతున్నారు.

కావ్య విజయాన్ని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్​లోనూ, భూపాలపల్లిలోనూ నిర్వహించిన జనజాతర ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ తెచ్చింది. ఎండలున్నా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో గెలుపు ఖాయమనే ధీమాను కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇక సుధీర్ కుమార్ విజయాన్ని కాంక్షిస్తూ ఆ పార్టీ అధినేత కేసీఆర్ నిర్వహించిన రోడ్ షో విజయవంతం కావడం, ఆ పార్టీ శ్రేణులకు గెలుపుపై మరింత ధీమా నిచ్చింది. అరూరి రమేశ్​ తరఫున ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రచారం, రోడ్​ షోకు మంచి స్పందన కనిపించింది. నగరం పూర్తిగా కాషాయమైంది. వచ్చే వారంలో ప్రధానితో పాటు మరికొందరు పార్టీ అగ్రనేతలూ కాషాయ అభ్యర్ధి తరఫున ప్రచారం చేయనున్నారు.

Kadiyam Kavya Plus Points For Election :వైద్యురాలిగా ఉంటూ అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న కడియం కావ్య, రాజకీయాలకు కొత్త అయినా తండ్రి కడియం శ్రీహరి వారసురాలిగా నిలిచి ప్రచారం పర్వంలో దూసుకుపోతున్నారు. వరంగల్ పార్లమెంటు బరిలో ఏడు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉండడం కావ్యకు అనుకూలమైన అంశం. దీంతో పాటు అధికార పక్షంగా కాంగ్రెస్ ఉండడం గతంలో సేవా కార్యక్రమాలతో పేరుపొందండం అన్నింటికీ మించి ఎలాంటి అవినీతి ఆరోపణలు తనపైన లేకపోవడం కావ్యకు ప్లస్ పాయింట్స్. ఒక పార్టీ నుంచి టికెట్ తెచ్చుకుని మరో పార్టీ నుంచి పోటీచేయడం ఆరంభంలో కొంత మేర అనుకూలత కలిగించింది.

BJP Candidate Aroori Ramesh Strategy :అంగబలం కలిగిన నేతగా పేరుపొందడం, ఎమ్మెల్యేగా గతంలో ఉన్న మాస్ ఫాలోయింగ్ బీజేపీ అభ్యర్ధికి అరూరి రమేశ్​కు కలిసొచ్చే అంశాలు. మోదీ సంక్షేమ పథకాలే తనను విజయతీరానికి చేరుస్తాయని రమేశ్​ విశ్వాసంతో ఉన్నారు. అయితే గతంలో వచ్చిన భూకబ్జా ఆరోపణలు పట్టణ, నగర ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో కమలం పార్టీ ఇంకా చొచ్చుకుపోకవడం అనుకూల అంశాలే. నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ సర్కార్​పై వచ్చిన వ్యతిరేకతే తనను గెలిపిస్తుందని బీఆర్​ఎస్​ అభ్యర్థి సుధీర్ కుమార్ భావిస్తున్నారు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవడం ప్లస్ పాయింట్ కాగా పార్లమెంటు పరిధిలో ఎక్కడా పార్టీ ఎమ్మెల్యేలు లేకపోవడం కొంత మైనస్ కలిగించే అంశాలని చెప్పవచ్చు.

ఓరుగల్లు పోరుగల్లుగా ఎన్నికల పోరు :ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ లోక్‌సభ పరిధిలో ఏడు నియోజకవర్గాల్లో ఓటర్ల తుది జాబితా 18 లక్షల 24 వేల 466 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 9 లక్షల 85 వేల 421 మంది పురుషులు, 9 లక్షల 28 వేల 648 మహిళలు, ఇతరులు 397 మంది ఉన్నారు. మొత్తానికి పార్లమెంటు ఎన్నికలు ఓరుగల్లును పోరుగల్లుగా మార్చేశాయ్. మండుటెండలకు మించి రాజకీయ వేడి మరీ ఎక్కువైంది. పోలింగ్‌ సమయం దగ్గరపడడంతో అన్ని పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాగా వరంగల్ కోటపై ఏ పార్టీ జెండా ఎగురుతుందో విజేతగా ఎవరు నిలుస్తారో అన్నదీ వేచి చూడాల్సిందే.

హోరెత్తుతున్న ఓరుగల్లు రాజకీయం - నాటి మిత్రులే నేడు ప్రత్యర్థులుగా! - LOK SABHA ELECTION 2024

ABOUT THE AUTHOR

...view details