Restaurant Style Chicken Handi Recipe : వేడివేడి అన్నం, కమ్మని పులావ్, బటర్ నాన్, మాంచి రోటీ.. ఇలా దేనికైనా సరే చికెన్ కూర ఉంటే ఆ మజానే వేరు. అయితే, ఆ వంటకాలకు తగినట్లు చికెన్ కూర కూడా రుచిగా ఉండాలి. అప్పుడే ఆ కాంబినేషన్ సూపర్ హిట్ అవుతుంది. అందుకే మీకోసం అలాంటి ఒక సూపర్ రెసిపీ తీసుకొచ్చాం. అదే, రెస్టారెంట్ స్టైల్ "చికెన్ హండి కర్రీ". టేస్ట్ అద్దిరిపోతుంది! పైగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. న్యూ ఇయర్‌కి ఇలా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాదీ ఫుల్ ఖుష్ అవ్వాల్సిందే! మరి, ఇంకెందుకు ఆలస్యం అందుకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- స్కిన్లెస్ చికెన్ - అరకిలో
- నూనె - 2 టేబుల్‌స్పూన్లు
- నెయ్యి - 1 టేబుల్‌స్పూన్
- ఉల్లిపాయలు - 2 (మీడియం సైజ్‌వి)
- టమాటాలు - 2 (మీడియం సైజ్‌వి)
- పచ్చిమిర్చి - 3
- అల్లంవెల్లుల్లి పేస్ట్ - ఒకటిన్నర టేబుల్‌స్పూన్లు
- పసుపు - అరటీస్పూన్
- ధనియాల పొడి - 1 టేబుల్‌స్పూన్
- జీలకర్ర పొడి - 1 టీస్పూన్
- కారం - తగినంత
- ఉప్పు - రుచికి సరిపడా
- పెరుగు - 200 గ్రాములు
- కసూరి మేతి - 1 టేబుల్‌స్పూన్
- ఫ్రెష్ క్రీమ్ - 3 టేబుల్‌స్పూన్లు
- గరంమసాలా - అరటీస్పూన్
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా చికెన్‌ని శుభ్రంగా కడిగి ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చిని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్, నెయ్యి వేసుకోవాలి. ఆ మిశ్రమం వేడయ్యాక ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి.
- ఆనియన్స్ వేగాక అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద అవి మెత్తబడే వరకు వేయించుకోవాలి.
- టమాటా ముక్కలు ఉడికాక మంటను లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని అందులో పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి చక్కగా కలుపుకోవాలి.
- ఆ తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్‌ని వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కలకు పట్టేలా కలిపి లో ఫ్లేమ్ మీద 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. అలా చికెన్‌ని వేయించుకునేటప్పుడే ఉప్పుని యాడ్ చేసుకోవాలి.
- ఆవిధంగా చికెన్‌ని వేయించుకున్నాక అందులో పెరుగుని వేసుకొని కలిపి మరో 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి.
- ఆ తర్వాత ఒకసారి కలిపి మూతపెట్టి మరో 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అనంతరం మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆపై సన్నని పచ్చిమిర్చి తరుగు, కసూరి మేతి, ఫ్రెష్ క్రీమ్ వేసి మరోసారి చక్కగా కలుపుకోవాలి.
- అనంతరం గరంమసాలా వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ టైమ్‌లో అవసరమనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి.
- ఆ తర్వాత మూత తీసి కొత్తిమీర తరుగు వేసుకొని కలిపి దింపేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే "రెస్టారెంట్ స్టైల్ చికెన్ హండి కర్రీ" రెడీ!
బ్యాచిలర్స్ రెసిపీ "చికెన్ టిక్కా బిర్యానీ" - వంట రాని వారు కూడా ఈజీగా చేసేస్తారు!