PM Modi Telangana Election Campaign Today : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల అగ్రనేతలు సభలు, రోడ్ షోలతో ప్రచార దూకుడును పెంచారు. ఈ తరుణంలో నేడు రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి రానున్నారు. ఒకే రోజు రెండు సభల్లో పాల్గొని బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపనున్నారు. ముందుగా కర్ణాటకలోని గుల్బర్గా నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో నారాయణపేటకు మధ్యాహ్నం 3.03 గంటలకు చేరుకోనున్నారు.
నారాయణపేట జూనియర్ కళాశాల మైదానంలో మహబూబ్‌నగర్ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా నిర్వహించే బహిరంగ సభకు మోదీ హాజరుకానున్నారు. మధ్యాహ్నం 3:15 నుంచి 4:05 వరకు బహిరంగ సభలో ప్రధాని పాల్గొని ప్రసంగించనున్నారు. నారాయణపేట సభ ముగించుకుని అనంతరం హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు రానున్నారు. సాయంత్రం 5:10కి హైదరాబాద్‌కు చేరుకోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించే బహిరంగ సభకు హాజరుకానున్నారు.
కాంగ్రెస్ పాలనలో రాజ్యాంగానికి రక్షణ లేదు - తెలంగాణలో అభివృద్ధి లేదు : ప్రధాని మోదీ
మోదీ సభ విజయం కోసం భారీ జన సమీకరణ : హైదరాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలు కలిపి ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న సభలో ప్రధాని 5:30 నుంచి 6:20 వరకు పాల్గొననున్నారు. బహిరంగ సభ అనంతరం 6:40కి బేగంపేట విమానాశ్రయం నుంచి భువనేశ్వర్‌కు బయల్దేరి వెళ్లనన్నారు. ప్రధాని సభ కోసం బీజేపీ రాష్ట్ర నాయకత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మోదీ సభ విజయవంతం కోసం భారీగా జనసమీకరణ చేస్తోంది. ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరడంతో నారాయణపేట, ఎల్బీ స్టేడియం వేదికగా ప్రధాని ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారని సర్వత్రా ఆసక్తి నెలకొంది.