PM Modi Speech in Nagarkurnool Public Meeting :రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధాని పర్యటిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసే బీజేపీ విజయ సంకల్ప సభకు(BJP Vijaya Sankalpa Sabha) హాజరైన ప్రధాని, కమలం పార్టీ అభ్యర్ధుల గెలుపే లక్ష్యంగా మోదీ బహిరంగ సభ కొనసాగుతుంది. మూడోసారి బీజేపీ గెలవాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు.
బీఆర్ఎస్ పట్ల ప్రజలు తమ కోపాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో చూపారని చెప్పారు. పదేళ్లుగా బీఆర్ఎస్, కాంగ్రెస్ తెలంగాణ ప్రజల కలలను చిదిమేశాయని దుయ్యబట్టారు. ఇన్నేళ్లు బీఆర్ఎస్ అవినీతికి పాల్పడితే ఇప్పుడు తమ వంతు వచ్చిందని కాంగ్రెస్ భావిస్తోందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అనే రెండు విసుర్రాళ్ల మధ్య తెలంగాణ నలిగిపోయిందని ఆరోపించారు. తెలంగాణను నాశనం చేసేందుకు హస్తం పార్టీకి ఈ ఐదేళ్లు చాలు అని ప్రధాని విమర్శించారు.
తెలంగాణలో మరింత కష్టపడితే 15 స్థానాల్లో గెలుస్తాం : అమిత్ షా
Modi Election Campaign in Telangana :రాష్ట్రంలో బీజేపీను గెలిపించాలని కోరిన ప్రధాని, ప్రజల ఆకాంక్షలను తాము నేరవేరుస్తామని అన్నారు. ప్రజాశ్రేయస్సు, అభివృద్ధి కోసం తాను రాత్రి, పగలూ పనిచేస్తానని తెలిపారు. శుక్రవారం మల్కాజిగిరిలో జరిగిన రోడ్‌షోలో ప్రజలు వీధుల్లో బారులు తీరి కాషాయ పార్టీకి మద్దతు తెలిపారన్నారు. బీజేపీ ఎంపీలను(BJP MP Candidates) భారీ సంఖ్యలో గెలిపిస్తే అప్పుడు కాంగ్రెస్ ఆటలు సాగవని పేర్కొన్నారు. ఆ పార్టీ ‘గరీబీ హఠావో' అని దశాబ్దాల క్రితమే నినాదం ఇచ్చిందన్న ప్రధాని, కానీ పేదరికం పోయిందా అని ప్రశ్నించారు.
మార్పునకు గ్యారంటీ - మోదీ గ్యారంటీ :కాంగ్రెస్ పాలన అంతా మోసం, దోపిడీ మాత్రమేనని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను ఓటు బ్యాంకుగానే చూసిందని విమర్శించారు. కమలం పార్టీకి పూర్తి మెజారిటీ ఇచ్చిన తర్వాతే దేశంలో మార్పు మొదలైందని చెప్పుకొచ్చారు. మార్పునకు గ్యారంటీ, మోదీ గ్యారంటీ(Modi Guarantee) మాత్రమేనని ఉద్ఘాటించారు. తన కోసం ఏ ఒక్కరోజు కూడా వినియోగించుకోలేదన్న మోదీ, రేయింబవళ్లు 140 కోట్ల ప్రజల కోసమే పని చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో కీలక నిర్ణయాలైన ఆర్టికల్ 370, అయోధ్య రామాలయం నిర్మాణం ఇందుకు కొన్ని ఉదాహరణలు అని మోదీ తెలిపారు.