AP CM Cabinet discuss on Fake News in Social Media : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వైఎస్సార్సీపీ చేస్తున్న ప్రచారంపై క్యాబినెట్ సమావేశం ముగిశాక సుదీర్ఘ చర్చ జరిగినట్లు సమాచారం. ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా ఉన్న పోస్టులపై ఉదాసీనత తగదంటూ ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చర్చ లేవనెత్తారు. అసభ్య, అవాస్తవ పోస్టులపై ఫిర్యాదు వస్తున్నా కొందరు పోలీసులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన తెలిపారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో క్రియాశీలకంగా వ్యవహరించిన అధికారులే ఇప్పుడు కీలక పదవుల్లో ఉన్నారనే అంశంపైనా కూడా చర్చ జరిగినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో రాజకీయ అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు చర్చించారు. కొందరు అధికారుల తీరు వల్లే రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని ఏపీ మంత్రులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. పలు జిల్లాలలోని ఎస్పీలు సైతం మంత్రులు ఫోన్లకు సరిగ్గా స్పందించడంలేదని తెలిపారు. కింద స్థాయిలో డీఎస్పీ, సీఐలపై నెపం నెట్టి తప్పుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మహిళల్ని కించపరిచేలా పెడుతున్న పోస్టులకు తాను తట్టుకోలేకనే తీవ్రంగా స్పందించాల్సిన అవసరం వచ్చిందని పవన్ కల్యాణ్ అన్నట్లు సమాచారం.