ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితిపై ఎంపీ రామ్మోహన్​ నాయుడు ప్రశ్న - నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే? - ap financial status

Nirmala Sitharaman Answer to MP Rammohan Naidu: ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితిపై అక్కడి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సూచనలు, హెచ్చరికలు ఇస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్‌నాయుడి అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక దుర్వినియోగం వల్ల నాలుగేళ్లుగా రాష్ట్రం తీవ్ర ఇబ్బందులు పడుతోందని రామ్మెహన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా క్రమశిక్షణలో పెట్టడానికి ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలని ఆయన అడగ్గా ఆర్థికమంత్రి స్పందించారు.

Nirmala_Sitharaman_Answer_to_MP_Rammohan_Naidu
Nirmala_Sitharaman_Answer_to_MP_Rammohan_Naidu

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 6, 2024, 10:02 AM IST

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితిపై ఎంపీ రామ్మోహన్​ నాయుడు ప్రశ్న - నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే?

Nirmala Sitharaman Answer to MP Rammohan Naidu: రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు, హెచ్చరికలు జారీచేస్తున్నామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ తెలిపారు. లోక్‌సభలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్‌ ఈ సమాధానమిచ్చారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 293 అవకాశం కల్పించిందని నిర్మలా సీతారామన్ అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక దుర్వినియోగం వల్ల నాలుగేళ్లుగా రాష్ట్రం తీవ్ర ఇబ్బందులు పడుతోందని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించడంలేదని, రహదారుల నిర్మాణం లాంటి మౌలిక వసతుల కల్పన కోసం పైసా ఖర్చుచేయలేదని పేర్కొన్నారు.

అంతేకాకుండా ప్రభుత్వరంగ కార్పొరేషన్లను అడ్డంపెట్టుకొని అప్పులు తీసుకుంటోందని, ఇలా ఒకవైపు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తోస్తూ మరోవైపు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితుల నుంచి తప్పించుకొనే ప్రయత్నం చేస్తోందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. అదే విధంగా మద్య నిషేధం చేస్తామని చెప్పి, మరోవైపు అదే మద్యం కార్పొరేషన్‌ ఆదాయాన్ని తాకట్టుపెట్టి రాష్ట్ర ప్రభుత్వం రుణం తీసుకుందని వ్యాఖ్యానించారు. ఒకవేళ రాష్ట్రం ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఏమిటి అని, రాష్ట్రాన్ని ఆర్థిక క్రమశిక్షణలో పెట్టడానికి ఏం చర్యలు తీసుకుంటారని ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు.

పవర్​ఫుల్​ లేడీగా నిర్మలా సీతారామన్​- వరుసగా ఐదోసారి జాబితాలో చోటు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికీ ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి ఉంటుందన్న నిర్మలా సీతారామన్, ఆంధ్రప్రదేశ్‌ ఎఫ్‌ఆర్‌బీఎం యాక్ట్‌ గురించి అసెంబ్లీ చూసుకుంటుందని వ్యాఖ్యానించారు. ఆ చట్టానికి అనుగుణంగా అక్కడ చర్చలు చేపడతారని, కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగం కల్పించిన అధికారం మేరకు రాష్ట్రాలకు మేము ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు, హెచ్చరికలు జారీ చేస్తున్నామన్నారు. తగిన చర్యలు తీసుకుంటున్నామని నిర్మలా సీతారామన్‌ వివరించారు.

జీఎస్‌టీ వృద్ధిరేటు ఇటీవల కాలంలో మందగించిన నేపథ్యంలో దానిపై ఆధారపడిన ఆంధ్రప్రదేశ్‌ లాంటి రాష్ట్రాల ఆర్థిక స్థిరత్వానికి కేంద్ర ప్రభుత్వం ఏదైనా అదనపు చర్యలు తీసుకుంటోందా అని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి లిఖితపూర్వకంగా అడిగిన ప్రశ్నకు ఆర్థికమంత్రి సమాధానం ఇచ్చారు. జీఎస్‌టీ ద్వారా ఆదాయం క్రమంగా పెరుగుతోందే తప్ప తగ్గడం లేదని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 10 నెలల్లోనే 11.6 శాతం వృద్ధి రేటును నమోదు చేసినట్లు ఆర్థికమంత్రి గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వానికి 2017 జులై నుంచి 2022 జూన్‌ వరకు జీఎస్‌టీ పరిహారం కింద 19 వేల 21 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్‌బీఐ హెచ్చరిక - రుణం తీసుకునే సంస్థలపై పట్టు ఉండాలని సూచన

"ప్రస్తుత ఏపీ ప్రభుత్వం ఆర్థిక దుర్వినియోగం వల్ల రాష్ట్రం తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ఉద్యోగులకు వేతనాలూ ఇవ్వలేకపోతోంది. రహదారుల నిర్మాణం లాంటి మౌలిక వసతుల కోసం ఏమీ ఖర్చు చేయలేదు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులకు చేరుకున్నప్పుడు ప్రభుత్వరంగ కార్పొరేషన్లను అడ్డం పెట్టుకుని అప్పులు తీసుకుంటుంది. ప్రస్తుత ప్రభుత్వం మద్యం నిషేధిస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు మద్యం కార్పొరేషన్‌ ఆదాయాన్ని తాకట్టు పెట్టి మరీ అప్పలు చేస్తోంది. రాష్ట్రం ఆర్థిక క్రమశిక్షణ తప్పినప్పుడు దానిని గాడిలో పెట్టడానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారో చెప్పండి". -రామ్మోహన్‌ నాయుడు, తెలుగుదేశం ఎంపీ

"కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రెండిటికీ ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌ ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం గురించి.. ఆ రాష్ట్ర శాసనసభ చూసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 293 కల్పించిన అధికారం మేరకు రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు, హెచ్చరికలు జారీ చేస్తున్నాం". - నిర్మలా సీతారామన్‌, కేంద్ర ఆర్థిక మంత్రి

ABOUT THE AUTHOR

...view details