Nalgonda BJP MP Candidate Fires On Congress :లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలవబోయే 400 ఎంపీ సీట్లలో నల్గొండ జిల్లా నుంచి ఒకటి ఉంటుందని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశం మొత్తం మోదీ రావాలి - బీజేపీ గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అబద్ధపు మాటలతో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చిందని, 6 గ్యారెంటీలు కాదు కదా ఒక్క దానిని కూడా అమలు చేయలేదని ఆరోపించారు. ప్రజా పాలన దరఖాస్తులు రోడ్ల పాలయ్యాయని, గతంలో జరిగిన ఘటనను గుర్తు చేశారు.
Saidi Reddy comments On Congress :కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కాంల పార్టీ అని ఎద్దేవా చేశారు. జిల్లాలో వేల ఎకరాల్లో పంటలు ఎండిపోతే పరిశీలించలేదని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిలపై మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీల్లో పోటీ చెయ్యడానికి కనీసం అభ్యర్థులు (Candidates) కూడా దొరకని పరిస్థితి నెలకొందన్నారు. ఇక రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే పోటీ అన్న ఆయన, లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) ఒక్క సీటు కూడా గెలవడం కష్టమని సంచలన ఆరోపణలు చేశారు.
సోషల్ మీడియా వార్తలపై స్పందించిన సైది రెడ్డి
నల్గొండలో బీజేపీ ఎంపీ అభ్యర్థిని మార్చాలంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా(Social Media), పత్రికల్లో వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. ఎంపీ అభ్యర్థిని ప్రధాని మోదీయే ప్రకటించాక అందులో ఎలాంటి సందేహం లేదని హాట్ కేక్ లాగా ఉందని అందుకే అలాంటి రూమర్స్ అయి ఉండొచ్చన్నారు. పార్టీ విజయానికి నాయకులు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. కొద్ది రోజుల క్రితమే సైది రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు మరికొందరు బీఆర్ఎస్ నాయకులు కూడా బీజేపీలో చేరారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలా పలువురు నాయకులు వలస వెళ్లడం బీఆర్ఎస్కు ఎదురుదెబ్బే అని చెప్పవచ్చు.