MLC Kodandaram Refused Personal Security :ఇటీవల గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులైన ప్రొఫెసర్ కోదండరాం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీకి ఇచ్చే సెక్యూరిటీని నిరాకరించారు. తనకు వ్యక్తిగత భద్రత సిబ్బంది అవసరం లేదని స్పష్టం చేశారు. తాను ప్రజల మనిషినని, సెక్యూరిటీ వల్ల ప్రజలతో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందువల్ల తనకు భద్రత సిబ్బంది అవసరం లేదని వెల్లడించారు.
మీడియాతో ఇష్టాగోష్ఠి నిర్వహించిన ఆయన మాట్లాడుతూ మంత్రివర్గంలో చోటుపై ఊహాగానాలు మాత్రమేనని, పదవిపై చర్చే జరగ లేదని చెప్పారు. ప్రస్తుతం 16లక్షల రేషన్ కార్డుల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇచ్చి ఉంటే రుణమాఫీపై ఇలాంటి సమస్యలు వచ్చేవి కాదని పేర్కొన్నారు. యూనివర్సిటీల్లో సామాజిక కూర్పు అవసరం కాబట్టి నియామకం ఆలస్యమైందని, ప్రస్తుతం యూనివర్శిటిల పరిస్థితిని చూశాక నియామకాలను తక్షణమే చేపట్టాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.
ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలి : గత ప్రభుత్వం పోస్టులు వేయకుండా నిరుద్యోగుల ప్రాణాలను తీసుకుందని కోదండరాం దుయ్యబట్టారు. బీఆర్ఎస్కు ఉద్యోగాల భర్తీపై మాట్లాడే నైతిక హక్కు లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేస్తుందన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని, ఆర్థిక స్థితి గతుల ఆధారంగా కేటగిరిలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమం పుట్టినప్పటి నుంచి మద్దతు ఇస్తున్నామని గుర్తుచేశారు.