MLC Kavitha on Groundnut Farmers Protest :తెలంగాణ శాసనసభ సమావేశాలు ఏడోరోజు కొనసాగుతున్నాయి. ఓవైపు శాసనసభలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం కాగ్ నివేదిక ప్రవేశపెట్టింది. మరోవైపు శాసనమండలిలో తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పు(Telangana Thalli Statue Issue)పై అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. కాకతీయ తోరణంలో రాచరికపు ఆనవాళ్లు ఏం ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఇటీవల ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వేరుశనగ రైతులు గిట్టుబాటు ధర కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రైతుల సమస్యను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సభ దృష్టికి తీసుకువెళ్లారు. రైతులకు గిట్టుబాట ధర కల్పించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు. కర్షకులకు నష్టం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళారీ వ్యవస్థను పారద్రోలి రైతుల ప్రయోజనాలు కాపాడాలని డిమాండ్ చేశారు.
వేరుశనగ రైతుల ఆందోళనలు - గిట్టుబాటు ధర ఇవ్వాలంటూ డిమాండ్
MLC Kavitha On Groundnut farmers Issue : వేరుశనగ పంటకు కనీస మద్దతు ధర కల్పించక పోవడంతో పాటు అచ్చంపేట, నాగర్ కర్నూల్, జడ్చర్ల వ్యవసాయ మార్కెట్లో రైతుల నిరసనల(Groundnut Farmers Protest in Mahabubnagar)పై కవిత స్పందించారు. వేరుశనగ కనీస మద్దతు ధర 6377 రూపాయలు ఉండగా 4నుంచి 5వేల రూపాయలకే కొనుగోలు చేస్తున్నారని సభ దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాన్ని సభలో ప్రత్యేకంగా ప్రస్తావించడానికి శాసనమండలి ఛైర్మన్ అనుమతిని కోరారు. అలాగే ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ నాయకులు గిట్టుబాటు ధర, బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారని, వాటిపైనా క్లారిటీ ఇవ్వాలని కోరారు.