MLA Rajagopal Reddy Comments on Harish Rao :తెలంగాణ అసెంబ్లీ సమావేశాల అనంతరం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీమంత్రి హరీశ్‌రావుపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ఎంత కష్టపడ్డా హరీశ్‌రావుకు ప్రయోజనం ఉండదన్న ఆయన, కాంగ్రెస్ పార్టీలోకి 25 మంది ఎమ్మెల్యేలను తీసుకు వస్తే దేవాదాయ శాఖ ఇస్తామన్నారు. బీఆర్‌ఎస్‌లో(BRS Party) చేసిన పాపాలు కడుక్కోవడానికే ఆ శాఖ ఇస్తామంటున్నట్లు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారని గుర్తు చేసిన రాజగోపాల్ రెడ్డి, ఇప్పుడు మళ్లీ తమ పార్టీలో చీలిక తీసుకురావాలని చూస్తున్నారని విమర్శించారు.
హరీశ్‌రావు రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ : మాజీ మంత్రులు హరీశ్‌రావు, కడియం శ్రీహరి తమను చీల్చాలని ఎదురు చూస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. హరీశ్‌రావు, కడియం శ్రీహరి(Kadiyam Srihari) మాదిరిగా తాము జీ హుజూర్ బ్యాచ్ కాదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ లాబీలో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. బీఆర్‌ఎస్ చీప్ పాలిటిక్స్ మానుకోవాలని హితవు పలికారు.
కేసీఆర్ రాష్ట్రాన్ని నాశనం చేశారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. హరీశ్‌రావును తమ పార్టీలోకి రమ్మని ఆహ్వానిస్తున్నామని చెప్పారు. బీఆర్‌ఎస్‌లో ఆయనకు భవిష్యత్ లేదని అన్నారు. హరీశ్‌రావు రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత తమపై పడిందని వ్యాఖ్యానించారు. నల్గొండ సభ కోసం డబ్బులు పంచుతూ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి(Jagadeesh Reddy) ప్రజల కాళ్లు పట్టుకుంటున్నారని విమర్శించారు.
హరీశ్‌రావు వర్సెస్ రాజగోపాల్‌రెడ్డి - అధికార పదవులపై సభలో రభస