MLA Rajagopal Reddy Fires on KCR : తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ విషయంలో గత ప్రభుత్వంపై కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపణాస్త్రాలు సంధించారు. పదేండ్ల పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శలు గుప్పించారు. విద్యుత్ పద్దుపై చర్చను ప్రారంభించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని అప్పుల్లోకి నెట్టేసిందని, దాని నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని స్పష్టం చేశారు.
ప్రతిపక్ష నేతగా కేసీఆర్ సభకు వచ్చి మాట్లాడాలని రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ సభకు ఎందుకు రావట్లేదని అడిగితే, కేసీఆర్‌తో మాట్లాడే స్థాయి మాది కాదన్నారని ఆయన మండిపడ్డారు. సభకు రానప్పుడు కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత హోదా కేసీఆర్ కాకుండా వేరేవారు తీసుకోవచ్చుకదా అంటూ ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి విమర్శలు చేయడం తగదని హితవు పలికారు.
MLA Rajagopal Reddy On Power Purchase :యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో పాత సాంకేతిక పరిజ్ఞానంతో, ఎప్పుడో పక్కన పడేసిన పాత మోటార్లను ఉపయోగించారని ఆక్షేపించిన రాజగోపాల్ రెడ్డి, ఆ విద్యుత్ ప్రాజెక్టు నిత్యం ఏదో విధంగా షట్ డౌన్ అవుతుందని అధికారులే బయట పెట్టారని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఆ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కూడా నామినేటెడ్ విధానంలో ఇవ్వడంతోపాటుగా ఇష్టానుసారంగా అంచనాలు పెంచి బీహెచ్‌ఈఎల్‌కు 20 వేల కోట్లు విలువైన పనులు ఇచ్చారని ఆరోపించారు.