Ministers Meeting in Peddapalli Parliamentary Constituency :బీఆర్ఎస్ పార్టీకి తమను విమర్శించే నైతిక హక్కు లేదని, గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను దారిలో పెడుతున్నామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. లోక్‌సభ ఎన్నిక(Lok Sabha Polls 2024)లో రాష్ట్రంలో గులాబీ పార్టీ ఒక్క సీటు కూడా గెలవదని జోస్యం చెప్పారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన పెద్దపల్లి పార్లమెంటు ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, స్థానిక శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు, వినోద్, పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. మంత్రులు ఇద్దరు బీజేపీ, బీఆర్‌ఎస్‌లపై ధ్వజమెత్తారు.
అనంతరం వంద రోజులు అయిందని హామీలు ఎప్పుడు అమలు చేస్తారని ఆరోపణలు చేస్తున్నారే గానీ, బీఆర్‌ఎస్ పార్టీ రెండు నెలలు తర్వాత పాలన మొదలు పెట్టారని ఆలోచించారా అంటూ మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 48 గంటల్లో పథకాలను(Congress Schemes) ప్రారంభించిందని అన్నారు. గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను దారిలో పెడుతున్నామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోతే అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీనే నిందించడం ఎంతవరకు సమంజసం అంటూ మంత్రి శ్రీధర్ అన్నారు.
బీఆర్ఎస్ ఖాళీ అవుతుందనే భయంతోనే కేసీఆర్ బయటికొచ్చారు : భట్టి విక్రమార్క
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలతో రైతులను నట్టేట ముంచితే, రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న రైతులను కనీసం పరామర్శించలేదని గిరిజన శాఖ మంత్రి సీతక్క అన్నారు. కానీ ఇప్పుడు రైతుల మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తూ లిక్కర్ స్కాం, ఫోన్ ట్యాపింగ్(Phone Tapping)లను పక్కదారి పట్టిస్తున్నారని ఆమె విమర్శించారు. పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగా యువకుడు వంశీకృష్ణను ఆదరించాలని, అభ్యర్థులను చూసి ఓటు వేయాలని మంత్రి సీతక్క కోరారు.