Minister Uttam Kumar Reddy Review on Small Lift Irrigation System : రాష్ట్రంలో పాక్షికంగా ఉన్న చిన్న లిఫ్టుల అభివృద్ధికి ప్రభుతం కృషి చేస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో నీటిపారుదల శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే పద్మావతిరెడ్డితో కలిసి పాల్గొన్నారు. పెద్ద లిఫ్టులకు అయ్యే లక్షల కోట్ల వ్యయం కన్నా కింది స్థాయిలో ఉండే లిఫ్టులకు ఖర్చు చేస్తే రైతులకు మేలు జరుగుతుందని వివరించారు. చిన్న లిఫ్టుల కింద దాదాపు ఆరు లక్షల ఎకరాలు సాగు భూమి ఉన్నట్లు పేర్కొన్నారు. కృష్ణ, గోదావరి, మూసీ, పాలేరు నదులపై ఉన్న లిఫ్టులతో పాటు సాగర్ లాంటి కాలువలపై ఉన్న లిఫ్టులను రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు.
"నిపుణులు, రైతు కమిటీలు, ప్రభుత్వ అధికారులు అందరూ కూడా చిన్న లిఫ్టులను తక్కువ ఖర్చు, సమయంలో ఎక్కువ ఆయకట్టుకు నీరందించేలా పనులు ముమ్మరం చేయాలి. సాంకేతిక పరంగా ఎలాంటి మార్పులు అవసరమో వాటిపై దృష్టి పెట్టాలి. చిన్న లిఫ్టులను అభివృద్ధి చేయడంతో ఖర్చు తగ్గుతుంది, రైతులకు సాగు నీటిని పుష్కలంగా అందిచవచ్చు. ప్రభుత్వాధికారులందరూ ప్రత్యేకంగా దీనిపై కసరత్తు చేయాలి." - ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి