Minister Tummala Fires On Opposition Parties : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. తమ రాజకీయ మనుగడ కాపాడుకొనేందుకు పడుతున్న పాట్లు చూస్తే జాలేస్తుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో గత నాలుగు రోజుల నుంచి ప్రతిపక్ష నేతలు అనేక విన్యాసాలు చేస్తూ సోషల్ మీడియా సాక్షిగా రైతాంగాన్ని అసత్య ప్రచారాలతో ఆందోళనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
ఒకరేమో లక్ష మాఫీ చేయడానికే ఆపసోపాలు పడి, చివరికి సగం మందికి కూడా చెయ్యలేక రైతుల నమ్మకం కోల్పోయిన వారు, ఇంకొకరు తాము అధికారంలో ఉన్న ఏ ఇతర రాష్ట్రంలోనూ ఇప్పటిదాకా రుణమాఫీ పథకం ఆలోచనే చెయ్యని వారు వీరిద్దరూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి పంటలోపే రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసి, ఇంకా ప్రక్రియ కొనసాగుతుండగానే ఎటూ పాలుపోక కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని మంత్రి ధ్వజమెత్తారు.
కుటుంబ నిర్ధారణ చేసి వారికి కూడా చెల్లిస్తాం : బ్యాంకుల నుంచి అందిన ప్రతి ఖాతాదారునికి వారి అర్హతను బట్టి మాఫీ చేసే బాధ్యత తమ ప్రభుతానిదని స్పష్టం చేశారు. ఇప్పటికి కేవలం రూ.2 లక్షల వరకు కుటుంబ నిర్ధారణ జరిగిన ఖాతాదారులందరికీ పథకాన్ని వర్తింప చేశామని తుమ్మల వెల్లడించారు. అలాగే రూ.2 లక్షల లోపు మిగిలి ఉన్న ఖాతాలకు కుటుంబ నిర్ధారణ చేసి వారికి కూడా చెల్లిస్తామని మంత్రి తెలిపారు. బ్యాంకర్ల నుంచి వచ్చిన డేటాలో తప్పుగా వివరాలు ఉన్న రైతుల వివరాలను కూడా వారి వద్ద నుంచి సేకరిస్తున్నామన్నారు.