Minister Tummala comments on PM Modi :రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల్లో 15 స్థానాలు గెలిచి సోనియా, రాహుల్ గాంధీలకు అప్పగిద్దామని మంత్రి తుమ్మల అన్నారు. ప్రధాని మోదీ 400 సీట్లు అంటూ మ్యాజిక్ డ్రామా, మైండ్ గేమ్ ఆడుతున్నారని చెప్పారు. రెండుసార్లు అధికారంలోకి వచ్చిన ప్రధాని ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ కూడా తేకపోగా ఉన్న సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇల్లెందులోని నిర్వహించిన కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల సన్నాహక భేటీలో ఆయన పాల్గొన్నారు.
మరోవైపు బీఆర్ఎస్ నాయకులు, మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలలు కూడా ఉండదని, ఆరు నెలల్లో కూలిపోతుందని కలలు కంటున్నారని మంత్రి తుమ్మల ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ను గెలిపించిన ప్రజలపై మానసిక స్థితితో బీఆర్ఎస్ ఎంత కోపంతో ఉందో తెలుస్తోందని అన్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు పడిపోతే దానిని కూడా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అప్పుల భారంగా చేశారని, కొత్త రుణాలకు కూడా అవకాశం లేకుండా చేశారన్నారు.
లోపాయికారి ఒప్పందం :'బీజేపీ బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకుని నువ్వు కొట్టినట్టు చెయ్యి నేను తిట్టినట్లు చేస్తాను' అనే ధోరణిలో వ్యవహరిస్తున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ నెల 19న జరిగే మహబూబాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ నామినేషన్ కార్యక్రమానికి లక్ష మంది పార్టీ శ్రేణులు హాజరుకావాలని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు.
'బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టు ఏమో కుంగిపోయింది. దానికి ఆ పార్టీ నేత పలు ప్రాజెక్టులు కూడా దెబ్బతిన్నాయని సమర్థించుకుంటున్నారు. ప్రాజెక్టులో అవినీతి చేశారు. ప్రభుత్వాన్ని అప్పుల భారంగా చేసి నిరుపయోగమైన అప్పులు చేశారు. దీని వల్ల ఇప్పులకు కొత్త అప్పులకు కూడా అవకాశం లేకుండా చేశారు. కాంగ్రెస్‌ను గెలిపించారని కర్కశంగా బీజేపీ, బీఆర్ఎస్లు వ్యవహరిస్తున్నాయి.'-తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ మంత్రి