Minister Ponnam Prabhakar on BRS : అబద్ధాలతో అప్రజాస్వామికంగా, అహంకారపూరితంగా మాజీ సీఎం కేసీఆర్ నిర్మించిన బీఆర్ఎస్, కాంగ్రెస్ అధికారం చేపట్టిన 100 రోజుల్లోనే కూలిపోతోందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. కర్ణాటకలోని గానుగాపూర్ దత్తాత్రేయ క్షేత్రాన్ని దర్శించుకున్న మంత్రి పొన్నం, తిరుగు ప్రయాణంలో జహీరాబాద్లో హస్తం పార్టీ ఎంపీ అభ్యర్థి సురేశ్ షెట్కార్తో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా అనైతికంగా, అప్రజాస్వామికంగా నిర్మించింది ఏదీ నిలబడదని, కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందని అంటున్న భారత రాష్ట్ర సమితిని చూస్తే ఆ విషయం అర్థం అవుతుందని అన్నారు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని కులమతాలను గౌరవిస్తూ, ప్రణాళిక బద్ధంగా పరిపాలన సాగిస్తోందని మంత్రి పొన్నం పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తూ, నిర్వీర్యమైన ఆర్టీసీని బలోపేతం చేసే దిశగా సాగుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే 1000 కొత్త బస్సులు కొనుగోలు చేయడంతో పాటు మరో 2 వేల బస్సులు కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. 3 వేల పైచిలుకు ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఇప్పటికే ప్రకటన వెలువరించామని గుర్తు చేశారు.