Minister Ponnam Prabhakar Fires on BRS Party :గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ కులాలకు ఆర్భాట ప్రకటనలు తప్ప, ఒరగబెట్టింది ఏమీ లేదని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. బీసీ కులాల సంక్షేమ భవనాలు, ఫెడరేషన్లకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని, పైన పటారం, లోన లొటారం అనే చందంగా కేసీఆర్ ప్రభుత్వం(BRS Govt) వ్యవహరించిందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షుడు వేముల వెంకటేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వడ్డెర ఆత్మగౌరవ సభలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, కర్ణాటక రాష్ట్ర మంత్రి మహాదేవప్ప, జగద్గురువు శ్రీ ఇమ్మడి సిద్ధ రామేశ్వర స్వామీజీలతో కలిసి పొన్నం పాల్గొన్నారు.
వడ్డెర ఫెడరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తా :రాష్ట్ర ఖజానాను గత ప్రభుత్వం ఖాళీ చేసి పోయిందని, ఇప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన విషయాన్ని ప్రజలు గ్రహించాలని మంత్రి పొన్నం కోరారు. వడ్డెర ఫెడరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తామన్న ఆయన, అయితే నిధులు లేకుండా ఫెడరేషన్(Federation) ఏర్పాటు చేస్తే ఉపయోగం ఉండదన్నారు. వచ్చే ఏడాది వరకు బడ్జెట్ కేటాయించి వడ్డెర ఫెడరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
వైద్యులు కేవలం ధనలక్ష్మి కటాక్షం కోసమే కాకుండా సామాజిక బాధ్యతగా సేవలందించాలి : పొన్నం ప్రభాకర్
మైనింగ్లలో వడ్డెరలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారన్న మంత్రి, ఆ విషయంలో సీఎం రేవంత్ రెడ్డితో(CM Revanth) చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీనిచ్చారు. ఇతర రాష్ట్రాల్లో ఎస్టీలుగా ఉన్న వడ్డెరలు, తెలంగాణలో బీసీలుగా కొనసాగుతున్నారని, వారిని ఎస్టీ జాబితాలో చేర్చాలంటే చట్టసవరణలు జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆ దిశగా వడ్డెరలు ఐక్యంగా ఉద్యమించాలని పొన్నం సూచించారు.