Minister Ponnam Prabhakar Fires on KTR :శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రతిపక్షం వ్యవహరిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శాంతిభద్రతల అంశంలో కఠినంగా వ్యవహరిస్తామని ఆయన పేర్కొన్నారు. భౌతిక దాడులు మంచి పద్ధతి కాదనని హితవు పలికారు. పార్టీ ఫిరాయింపులను తాము ఎక్కడా ప్రోత్సహించలేదని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ గతంలో టీడీపీ, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులను చేర్చుకుందని గుర్తు చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ మంత్రి పదువులు ఇవ్వలేదా అంటూ ప్రశ్నించారు. సీఎల్పీగా దళితుడు ఉంటే ఓర్వలేక కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ చేర్చుకుందని ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని కూలగొడతాం అని బీఆర్ఎస్, బీజేపీ అంటున్నాయని చెప్పారు. ప్రజాస్వామికంగా పాలనన చేస్తున్నామని, ప్రభుత్వాన్ని అస్థిరపరిచేలా మాట్లాడే నేతలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఏం జరిగిందని శాంతిభద్రతలు క్షీణించాయని అంటున్నారని అడిగారు.
ఆంధ్రా ప్రజలను అత్యంత దారుణంగా విమర్శించింది కేసీఆర్ :మరోవైపు కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టింది బీఆర్ఎస్ సభ్యులు కాదా అని ప్రశ్నించారు. హైదరాబాద్లో నివసించే వారిని ఏనాడు కాంగ్రెస్ విమర్శించలేదని అన్నారు. అత్యంత దారుణంగా ఆంధ్రా ప్రజలను విమర్శించింది కేసీఆర్ అని చెప్పారు. బీఆర్ఎస్ పని అయిపోయిందని ఆ పార్టీ నేత గాంధీనే చెబుతున్నారని పేర్కొన్నారు. ప్రాంతీయత్వాన్ని రాజకీయంగా వాడుకోవాలనని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోందని తెలిపారు.