Ponguleti Hot Comments On KTR : మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో గురువారం పర్యటించిన రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొర్రూరు వ్యవసాయ మార్కెట్ పాలకమండలి, వర్ధన్నపేట మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శలను మంత్రి తిప్పికొట్టారు. తప్పు చేయని వారికి ఏమీ కాదని, కానీ ప్రజల డబ్బును విదేశాలకు తరలించి తప్పు చేసినవారిపై మాత్రం ఆటం బాంబులు పేలుతాయని అన్నారు. అరెస్టులపై తానెవరి పేరుని కానీ, పార్టీ పేరును కానీ ప్రస్తావించుకున్నా ఎందుకు ఉలిక్కిపడుతున్నారో అర్థం కావట్లేదన్నారు.
తప్పు చేశామనుకుంటే సరెండరై కోర్టు విధించే శిక్ష అనుభవించాలి : గుమ్మడి కాయల దొంగ అంటే ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరోక్షంగా కేటీఆర్‌ను ఉద్దేశించి విమర్శించారు. ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ ఎవరినీ అరెస్ట్ చేస్తామని చెప్పలేదని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారిపై ఆటం బాంబు పేలుతుందన్న పొంగులేటి, తప్పు చేశామని అనుకుంటే ముందే సరెండరై కోర్టు విధించే శిక్ష అనుభవించాలన్నారు. కేటీఆర్ పాదయాత్ర చేసినా మోకాళ్ల యాత్ర చేసినా తమకు అభ్యంతరం లేదన్నారు. కేటీఆర్ పాదయాత్ర చేస్తే తాము స్వాగతిస్తామన్న పొంగులేటి ఆయన ఏ యాత్ర అయినా చేసుకోవచ్చన్నారు. అధికారం పోయిన పదినెలల తరువాత పేదవాళ్ల కష్టాలు గుర్తొచ్చాయా అని ఆక్షేపించారు.
రైతులు పడుతున్న బాధలు చూసే రుణమాఫీ చేశాం తప్ప ఎన్నికల కోసం కాదని పొంగులేటి స్పష్టం చేశారు. మిగిలిన రూ.13వేల కోట్ల బకాయిలను డిసెంబర్‌లోగా రైతులకు చెల్లిస్తామని పేర్కొన్నారు. త్వరలోనే ప్రతి ఇంటికీ స్మార్ట్‌కార్డు ఇస్తామని, అది రేషన్, ఆరోగ్యశ్రీకార్డుతో పాటు అన్నివిధాలుగా ఉపయోగపడుతుందని తెలిపారు. ధరణి పేరుతో వేలాది ఎకరాలను దోచేశారని దానిని ప్రక్షాళన చేసే కార్యక్రమం ఈ నెలఖరుతో పూర్తి చేయనున్నట్లు మంత్రి చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు కోసం ఎంతో ఆశగా ప్రజలు చూస్తున్నారని, రూ.7 లక్షల కోట్లకు పైగా అప్పున్నా భారీ సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లను మెరుగైన రీతిలో కట్టిస్తామని హామీ ఇచ్చారు.
ఇందిరమ్మ ఇళ్ల ఎంపికపై కీలక అప్డేట్ - వచ్చే వారం అందుబాటులోకి ప్రత్యేక యాప్