Special Stoty On Black Berry Island Tourist Place in Mulugu : ఉరుకులు పరుగుల జీవితం. మానసిక ప్రశాంతత, ఉల్లాసం కోసం నగరవాసులే కాదు పల్లె ప్రజలూ సమయం కేటాయిస్తున్న రోజులివి. కుటుంబంతోనో, స్నేహితులతోనో కొన్ని రోజుల పాటు సరదాగా విహార యాత్ర చేయాలి అనుకుంటారు. వీకెండ్స్ వచ్చినా, లాంగ్ హాలీడేస్ వచ్చినా ట్రిప్స్ ప్లాన్ చేస్తుంటారు. అలా సరదాగా విహార యాత్ర చేయాలనుకునే వారి కోసం అందాల బ్లాక్ బెర్రీ ఐలాండ్ రమ్మంటూ ఆహ్వానం పలుకుతోంది. మరి ఇదెక్కడ అనుకుంటున్నారా? మన రాష్ట్రంలోనే ఉంది.
ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మొండ్యాలతోగు సమీపంలో ఉన్న ఈ ప్రదేశాన్ని పర్యాటక శాఖ తీర్చిదిద్దింది. జలగలాంచా వాగు మధ్య సుమారు ఐదెకరాల విస్తీర్ణంలో, చల్లని వాతావరణంలో ప్రకృతి వనం మధ్య ఉన్న ద్వీపం పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఒకటి, రెండు రోజుల్లో ప్రారంభానికి సిద్ధమవుతున్న ఈ దీవి విశేషాలు తెలుకుందామా మరి.
గుడారాలు ఏర్పాటు : పర్యాటకులు రాత్రి బస చేసేందుకు దీవిలో 50 ఆధునిక గుడారాలు సిద్ధం చేశారు. ఇద్దరు ఉండేలా 25, ముగ్గురు ఉండడానికి 21, నలుగురు ఉండేందుకు 4 గుడారాలు ఏర్పాటు చేశారు.
ఆడుకునేందుకు బీచ్ వాలీబాల్ తరహా కోర్టు సిద్ధం చేశారు. చిన్నారులు, ఇతరుల కోసం షటిల్ కోర్టులను సైతం ఏర్పాటు చేశారు. కబడ్డీ, ఖోఖో ఆడుకోవచ్చు. దీవి చుట్టూ ప్రవహించే జలగలాంచ వాగు నీటిలో చిన్నారులు సైతం ఆడుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వాగులో ఫిషింగ్ చేసే సదుపాయం సైతం కల్పించాలన్న ఆలోచనలో ఉన్నారు.
ఫుడ్ ఎంజాయ్ చేస్తూ : అలా కుటుంబం, స్నేహితులతో సమయం గడిపేందుకు వచ్చిన పర్యాటకుల ఇష్టాల మేరకు భోజనం తయారు చేసి వడ్డించేందుకు రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. తెలంగాణ, నార్త్ ఇండియా వంటకాలు చేసే చెఫ్‌లను నియమించారు. సినిమాల్లో మాదిరి రాత్రివేళ చలిమంటలు వేస్తారు. అక్కడ కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చు. అడవినంతా వీక్షించేలా ఏర్పాటు చేసిన మంచె అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. రాత్రిల్లు చక్కగా, హాయిగా ఎంజాయ్ చేయొచ్చు.
ములుగు జిల్లాలో ఉన్న ఈ బ్లాక్ బెర్రీ దీవికి ఇటు హైదరాబాద్ నుంచి, అటు ఏపీ నుంచి బస్సుల్లో నేరుగా చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి ఏటూరునాగారం, మంగపేట, భద్రాచలం వైపు వచ్చే బస్సుల్లో పస్రా వద్ద దిగాలి. ఆంధ్రప్రదేశ్ నుంచి భద్రాచలంలో దిగి అక్కడి నుంచి వరంగల్, హనుమకొండ, హైదరాబాద్ బస్సుల్లో చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి సుమారు 220 కి.మీ దూరం ఉంది. దీవిలో బస చేసేందుకు పర్యాటక శాఖ యాప్ నుంచి బుక్ చేసుకునే వెసులుబాటుంది. ప్రత్యేక వెబ్‌సైట్ కూడా తీసుకొస్తున్నారు. ధరను ఇంకా నిర్ణయించనప్పటికీ ఒక్కొక్కరికి రోజుకు రూ.1500 నుంచి రూ.2 వేల వరకు ఉండే అవకాశముందని తెలుస్తోంది.
వరంగల్‌లో భూగర్భ దేవాలయం - కాపాడుకుంటేనే మన చరిత్ర సజీవం
పొరుగు రాష్ట్రంలో 'చైనావాల్'ను తలపించే నిర్మాణం! - అక్కడ శిల్పాలను స్కాన్ చేస్తే చాలు అద్భుతాలే