Minister Parthasarathy and MLA Sirisha Apologize:గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ పాల్గొనడంపై మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే గౌతు శిరీష వివరణ ఇచ్చారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో ఆదివారం గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జోగి రమేష్‌ను ఎవరు పిలిచారంటూ టీడీపీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్యక్రమంలో పాల్గొన్న పార్థసారథి, శిరీష వివరణ ఇవ్వాలని మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. విగ్రహావిష్కరణలో జోగి రమేష్ పాల్గొనడంపై తమ ప్రమేయం లేదని ఇరువురు క్షమాపణలు తెలియజేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు.
ఎల్లవేళలా టీడీపీ బలోపేతానికి కృషి చేస్తా:లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జోగి రమేష్ పాల్గొంటారని తనకు ముందే తెలియదని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. అలా తెలిసి ఉంటే తాను హాజరయ్యే వాడిని కాదని చెప్పారు. తనని అభిమానించే టీడీపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిని ఉంటే వారికి క్షమాపణలు చెప్తున్నానని అన్నారు. అలానే అధినేత చంద్రబాబుకి కూడా క్షమాపణ తెలిపారు. పార్టీకి నష్టం కలిగించే కార్యక్రమాలు తాను ఏ రోజూ చేయనని స్పష్టం చేశారు. ఎల్లవేళలా టీడీపీ బలోపేతానికి కృషి చేస్తానని అలానే చంద్రబాబు, లోకేశ్ నాయకత్వం బలపడేందుకు పని చేస్తానని చెప్పారు.