MINISTER NARA LOKESH COMMENTS: విశాఖలో ప్రధాని పర్యటన విజయవంతం చేయాలని కూటమి శ్రేణులకు మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ఈ నెల 8వ తేదీన ప్రధాని మోదీ విశాఖలో పర్యటించనున్నారు. బల్క్ డ్రగ్ పార్క్, రైల్వే జోన్ భవనాల స్థాపన, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ శంకుస్థాపనతో పాటు 41 అభివృద్ధి కార్యక్రమాలు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమవుతాయని మంత్రి లోకేశ్ తెలిపారు. అదే విధంగా విశాఖలో ప్రధాని ఒక రోడ్ షో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
విశాఖ కలెక్టరేట్‌లో ప్రధాని పర్యటన మీద సమీక్ష నిర్వహించి మీడియాతో మాట్లాడారు. ప్రధాని ఎన్నికల ముందు చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభలో పాల్గొన్నారని, అనంతరం విజయవాడలో ఒక రోడ్ షో చేశారని గుర్తు చేశారు. చిలకలూరిపేట, విజయవాడ కార్యక్రమాల కంటే విశాఖపట్నంలో ప్రధాని పర్యటన మరింత విజయవంతం కావాలని అన్నారు.
ఉత్తరాంధ్రకు జగన్ చేసిందేమి లేదు:గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జగన్ తన కోసం రిషికొండ ప్యాలెస్ కట్టుకున్నారు తప్ప ఉత్తరాంధ్రకు చేసిందేమీ లేదని మంత్రి లోకేశ్ ధ్వజమెత్తారు. ఐదేళ్ల పాలనలో ఒక్క పరిశ్రమను తీసుకురాకపోగా, ఉన్న పరిశ్రమలను తరిమేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం సమష్టిగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
మరో 2 నెలల్లో విశాఖలో టీసీఎస్: ప్రతి నెల రూ.4 వేల కోట్ల లోటు బడ్జెట్‌తో రాష్ట్రం నడుస్తోందని లోకేశ్ తెలిపారు. అయితే కేంద్ర సహకారం వల్ల రాష్ట్రం ముందుకు పోతోందని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం ప్రత్యేక సహకారాన్ని అందిస్తోందని అన్నారు. మరో 2 నెలల్లో విశాఖలో టీసీఎస్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని లోకేశ్ స్పష్టం చేశారు.