Konda Surekha Comments On BRS : గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనల వెనక బీఆర్ఎస్ పార్టీ ఉందని రాష్ట్ర దేవాదాయ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. బీఆర్ఎస్ నేత, గురుకులాల మాజీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ద్వారా కేటీఆర్ కుట్ర చేస్తున్నారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు గురుకులాల్లో అనుచరులు ఉన్నారన్నారు. అందువల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని సందేహం వ్యక్తం చేశారు. ప్రవీణ్ కుమార్ హయాంలో గురుకులాల్లో అక్రమాలు జరిగాయని కొండా సురేఖ విమర్శించారు.
అన్ని విషయాలు బయటకు వస్తాయి :కేటీఆర్ అండ్ టీం అభివృద్ధిని అడ్డుకుంటూ పక్కా ప్రణాళికతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ ఉందని అన్ని విషయాలు బయటకు వస్తాయని కొండా సురేఖ హెచ్చరించారు. కేటీఆర్‌కు ఆయన చేసిన తప్పులు తెలుసు కాబట్టే జైలుకు పోతానంటూ పదేపదే అంటున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. కవిత జైలు నుంచి బయటకు రాగానే కేసీఆర్ ఆమెకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని దాంతో కేటీఆర్ మానసికంగా ఇబ్బంది పడుతున్నారని మంత్రి కొండా సురేఖ అన్నారు. కేసీఆర్ కుటుంబంలో కవిత, హరీశ్ రావు ఒక్కటయ్యారని చర్చ జరుగుతోందన్నారు. సమయం వచ్చినప్పుడు కేటీఆర్‌తో పాటు కేసీఆర్ కూడా జైలుకు వెళ్తారని మంత్రి ధ్వజమెత్తారు.