Minister Komatireddy On Express Highway Between Hyderabad to Yadadri :హైదరాబాద్ నుంచి యాదాద్రి వెళ్లేందుకు ఎక్స్ప్రెస్ హైవే నిర్మిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. ఈ హైవే నిర్మిస్తే కేవలం 30నిమిషాల్లో ఉప్పల్ నుంచి యాదాద్రి వెళ్లొచ్చని తెలిపారు. యాదగిరిగుట్ట మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంపీపీ, ఎంపీటీసీల ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తాను ఎంపీగా ఉన్నప్పుడు 100శాతం జాతీయ రహదారులను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. జిల్లాలో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్లు వివరించారు. ఎంపీగా గెలిపించినప్పుడే చాలా పనులు చేసిన తాను ఇప్పుడు మంత్రి అయ్యాడని రెట్టింపు పనులు చేస్తానని హామీ ఇచ్చారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా తనను ఎంపీగా గెలిపించినందుకు కార్యకర్తలకు రుణపడి ఉంటానన్నారు. యాదాద్రి వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎక్స్ప్రెస్ హైవే రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం దేవాలయాన్ని అభివృద్ధి చేసింది కానీ రహదారులు, మున్సిపల్ పరిధిలో ఉన్న జనాల బాగోగులు మరచిపోయారని విమర్శించారు.
రహదారులకు పెద్దపీట :గతంలో ప్రభుత్వానికి రహదారులు అభివృద్దిపై ఎన్నోసార్లు వినతిపత్రాలు అందజేసినా ఎవ్వరూ పట్టించుకోలేదని గుర్తుచేశారు. అందుకే ఇప్పుడు రహదారుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు వివరించారు. యాదాద్రిని యాదగిరిగుట్టగా పేరు మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపినట్లు చెప్పారు. అలాగే జిల్లాలో అన్ని రకాల ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.