Minister Jupally Krishna Rao on Excise Department : గత ప్రభుత్వం పదేళ్లపాటు టెండర్లు లేకుండా ఒక్కరికే హోలోగ్రామ్ తయారీని అప్పగించిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గత ప్రభుత్వం చేసిన అక్రమాలను ఒక్కోదాన్ని సరిచేసుకుంటూ వెళ్తున్నామని చెప్పారు. బ్రూవరీల నుంచి స్టాక్ పక్కదారి పట్టకుండా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత ప్రభుత్వం చాలా శాఖల్లో బిల్లులు పెండింగ్ పెట్టిందని మంత్రి జూపల్లి కృష్ణారావు వివరించారు. మద్యం కొరత ఉంటే ప్రజలకు నష్టం లేదని స్పష్టం చేశారు. గతంలో పైరవీలు, ముడుపులు ఉంటే తప్ప బదిలీలు జరిగేవి కావని ఆరోపించారు. ఇప్పుడు పైరవీలు, ముడుపులు లేకుండా పోర్టల్ ద్వారా బదిలీలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. దొంగే దొంగ అన్నట్లుగా బీఆర్ఎస్ నేతల మాటలు ఉన్నాయని చెప్పారు.
కొత్త బ్రాండ్లకు ఎవరూ దరఖాస్తు చేసుకోలేదు : ఎన్నికల కోడ్ ముగిశాక ఎక్సైజ్‌శాఖను మరింత ప్రక్షాళన చేస్తామని తెలిపారు. కొత్త బ్రాండ్ల కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదు, తాము పరిశీలించలేదని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి వివరణ ఇచ్చారు. మద్యం సరఫరాలో బ్లాక్ మార్కెటింగ్‌ను పటిష్ఠంగా నివారిస్తున్నామని వెల్లడించారు. మద్యం విక్రయాలు తగ్గితే ప్రభుత్వానికే నష్టమని, ప్రజలకు కాదని ఈ సందర్భంగా చెప్పారు. అలాగే టానిక్ మద్యం దుకాణాలకు గత ప్రభుత్వం ఇచ్చిన పన్ను మినహాయింపును రద్దు చేశామని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీకి మధ్య తేడా ఉందని తెలిపారు.