Massive Manipulation in NEDCAP During YSRCP Govt:ప్రజాబాహుళ్యంతో అంతగా సంబంధం లేని పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (New & Renewable Energy Development Corporation of Andhra Pradesh - నెడ్‌క్యాప్)నూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వదల్లేదు. జగన్ అండ్ కో అడ్డగోలు వ్యవహారాలను చక్కబెట్టడానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సమీప బంధువుకి నిబంధనలకు విరుద్ధంగా జీఎం హోదాను కట్టబెట్టింది. సంస్థ పరిధిలోని ప్రాజెక్టులు కాంట్రాక్టుల్ని అస్మదీయులకు కట్టబెట్టి కోట్లాది రూపాయల దోపిడీకి పాల్పడింది.
నెడ్‌క్యాప్ ద్వారా కేటాయించే ప్రాజెక్టుల్లోనూ భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడినట్లు తెలిసింది. 20 మెగావాట్ల లోపు ఉన్న సౌర విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతులిచ్చే అధికారాన్ని ప్రభుత్వం నెడ్‌క్యాప్‌నకు కట్టబెట్టింది. దీన్ని ఆసరాగా చేసుకుని మాజీ మంత్రి బంధువు వేలాది మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టినట్లు సమాచారం. దీనికోసం ఒక్కో మెగావాట్‌కు లక్షా 25 వేల రూపాయల చొప్పున కమీషన్ తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఐదేళ్లలో 100 కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించినట్లు సమాచారం.
రాష్ట్రంలో 33 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజి విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు గత ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది. వీటిలో మెజారిటీ ప్రాజెక్టులను అదానీ, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్, గ్రీన్‌కో సంస్థలకు నామినేషన్ విధానంలో కేటాయించింది. 29 లొకేషన్లను గుర్తించి 16 చోట్ల వివిధ సంస్థలకు కేటాయించిన ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్‌ల తయారీకి నెడ్‌క్యాప్ టెండర్లు పిలిచింది. ప్రాజెక్టుల్ని దక్కించుకున్న సంస్థల నుంచి డీపీఆర్‌ల తయారీ కోసం 5 కోట్ల చొప్పున వసూలు చేసింది. ప్రాజెక్టులు దక్కించుకున్న సంస్థలకు భూ కేటాయింపుల వ్యవహారంలో మాజీ మంత్రి సమీప బంధువు భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం.
పెద్దిరెడ్డి నియోజకవర్గంలోని ఒక మెగావాట్ సౌర విద్యుత్ ప్రాజెక్టు వార్షిక నిర్వహణ పనులనూ అస్మదీయ కంపెనీకే అప్పగించారు. ఏడాదికి 5 లక్షలకు మించని పనులను సుమారు ఎనిమిది రెట్లు పెంచి 40 లక్షలు చెల్లించేలా గుత్తేదారు సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ పనుల్ని సంస్థలో పనిచేసే ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి చెందిన కంపెనీకే కట్టబెట్టారు.
గుడివాడలో వైఎస్సార్సీపీ అక్రమాలు - టిడ్కో ఇళ్ల పేరుతో భారీగా దోపిడీ - Irregularities in Amrit Scheme
నెడ్‌క్యాప్‌లో 238 మంది సిబ్బంది పని చేస్తుండగా వారిలో శాశ్వత ఉద్యోగులు ఐదుగురే.! 2024 జులైలో ముగ్గురు పదవీ విరమణ చేయనుండగా ఇద్దరే మిగులుతారు. ప్రస్తుతం సంస్థలో 233 మంది ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారు. సిబ్బంది నియామకంలోనూ అస్మదీయులకే అవకాశం కల్పించి ఒక కోటరీ ఏర్పాటు చేసుకున్నారు. సుమారు 153 మంది సిబ్బంది పదవీ విరమణ తర్వాత ప్రభుత్వం జీఎంగా కొనసాగిస్తున్న వ్యక్తికి సంబంధించిన బంధువులు, ఆయన దగ్గర గతంలో పనిచేసిన వారే ఉన్నట్లు సమాచారం.
ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని అందించే అల్ఫా వోక్స్‌ను నిర్వహించే వ్యక్తి నెడ్‌క్యాప్‌లో డెవలప్‌మెంట్ అధికారిగా గుంటూరులో పనిచేస్తున్న ఉద్యోగే. ఈయనా మంత్రి బంధువుకు సన్నిహితంగా ఉండే వ్యక్తేనని సమాచారం. వైఎస్సార్సీపీ హయాంలో వివిధ సంస్థల్లో నియమించిన రిటైర్డు సిబ్బందిని విధుల నుంచి తప్పించాలని కూటమి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినప్పటికీ ఈ సంస్థలో అవి అమలు కాలేదు.
మాజీ సీఎం జగన్ కార్యదర్శిగా వ్యవహరించిన ధనుంజయరెడ్డి దగ్గరి బంధువు మురళీకృష్ణారెడ్డిని ఏపీ సోలార్ కార్పొరేషన్‌లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా గత ప్రభుత్వం నియమించింది. సోలార్ కార్పొరేషన్ వ్యవహారాల్ని ఆయనే శాసించారు. ఉమ్మడి రాష్ట్రంలో నెడ్‌క్యాప్ ఎండీగా సబ్సిడీ దుర్వినియోగానికి పాల్పడిన కేసులో సంస్థ ప్రస్తుత ఎండీ కమలాకర్‌బాబుపై ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులను బూచిగా చూపుతూ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందీ రాకుండా చూస్తానంటూ ఆయననూ మభ్యపెడుతున్నట్లు సమాచారం. దీంతో మురళీకృష్ణారెడ్డి అక్రమాలు బయటకు రాకుండా ఎండీ వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మురళీని ఇటీవల ఈ బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు.
నెడ్‌క్యాప్‌లో జరిగే అభివృద్ధి పనుల టెండర్లలో మెజారిటీ వాటాను కొన్ని కంపెనీలే దక్కించుకున్నాయి. ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది కాంట్రాక్టు, సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఇలా గత ఐదేళ్లలో సంస్థలో జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించి కోట్లాది రూపాయల టెండర్లను ఈ సంస్థలే దక్కించుకున్నాయి. అవన్నీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగికి సంబంధించినవే. నెడ్‌క్యాప్‌లో జరిగే ఒక్కో పనిని ఒక్కో కంపెనీ టెండర్ల ద్వారా దక్కించుకున్నాయి. ఈ వ్యవహారం వెనుక మాజీ మంత్రి బంధువు ప్రమేయం ఉంది. ఈ అక్రమాలు బహిర్గతమైతే ప్రభుత్వం నుంచి ఇబ్బందులొస్తాయన్న ఆలోచనతో కొద్ది రోజుల కిందట జీఎం పోస్టుకు ఆయన రాజీనామా చేశారు.
తిరుమలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ - వెలుగుచూస్తున్న వైఎస్సార్సీపీ అక్రమాలు - YSRCP Irregularities in Tirumala